వరంగల్, జనవరి 18(నమస్తేతెలంగాణ) : చినుకై.. వానై.. వరదై.. చివరికి ఉప్పెనై అన్నట్లుగా ఉమ్మడి జిల్లా ప్రజలు బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పోటెత్తారు. బుధవారం ఖమ్మం జిల్లాలో జరిగిన భారత రాష్ట్ర సమితి ‘జాతీయ భేరి’కి ప్రతి ఊరి నుంచీ స్వచ్ఛందంగా తరలివెళ్లారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వాహనాల్లో బయలుదేరారు. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి నుంచి ఖమ్మం దారుల్లో ఎటు చూసినా వాహనాలతో బారులు తీరి కనిపించారు. సభలో విశిష్ట అతిథులతో పాటు జననేత.. పార్టీ అధినేత.. సీఎం కేసీఆర్ ప్రసంగం విని నూతనోత్సాహంతో తిరుగుపయనమయ్యారు. కనీవినీ ఎరుగని తీరులో సభ సూపర్ సక్సెసై బీఆర్ఎస్ సరికొత్త చరిత్ర సృష్టించిందని, దేశానికి గులాబీ పార్టీ ఆశాకిరణమైందన్న అభిప్రాయాలు వెలిబుచ్చారు.
బీఆర్ఎస్ తొలి బహిరంగ సభకు జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆర్టీసీ బస్సులు, రైళ్లు, కార్లు, ఇతర వాహనాల ద్వారా పోటాపోటీగా తరలివెళ్లారు. జాతీయ స్థాయిలో పోరుకు బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. బుధవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ విధానాలను ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. జనం అంచనాలకు మించి హాజరు కావడంతో ఈ సభ బీఆర్ఎస్ శ్రేణులకు మరింత ఉత్తేజాన్నిచ్చింది. రాయపర్తి మండలం నుంచి వేలాది మంది ఖమ్మం బహిరంగ సభకు హాజరయ్యారు.
మండలంలోని 39 గ్రామ పంచాయతీల పరిధిలోని పల్లెల నుంచి పార్టీ శ్రేణులు ఆర్టీసీ బస్సుల ద్వారా ఖమ్మం చేరుకున్నాయి. రాయపర్తిలో వాహనాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. అలా గే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో పాటు మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ మండల, పట్టణ, డివిజన్, వార్డు, గ్రామ కమిటీల అధ్యక్ష, కార్యదర్శులు, రైతుబంధు సమితి కన్వీనర్లు, కార్యకర్తలు ఖమ్మం సభకు హాజరయ్యారు.
గ్రామం, వార్డు, డివిజన్, పట్టణం నుంచి ఖమ్మం బయల్దేరిన వాహనాలను పార్టీ జెండా ఊపి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. బీఆర్ఎస్ జిందాబాద్, కేసీఆర్ నాయక త్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నెక్కొండ, చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, గీసుగొండ, సంగెం, పర్వతగిరి, వర్ధన్నపేట మండలం, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలతో పాటు వరంగల్‌లోని బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు తమ పార్టీ శ్రేణులతో కలిసి ఖమ్మం బహిరంగ సభకు హాజరు కావడానికి ఆసక్తి కనబరిచారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ఖమ్మం బయల్దేరిన వాహనాలను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జెండా ఊపి ప్రారంభించారు.