హసన్‌పర్తి, ఏప్రిల్ 18 : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్‌భాస్కర్ లాంటి నాయకుడు ఉండడం ప్రజల అదృష్టమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. చింతగట్టులో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ 53, 54 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ తర్వాత హనుమకొండ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని అన్నారు. హనుమకొండ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని సూచించారు.
పశ్చిమ నియోజకవర్గంలో వినయ్‌భాస్కర్ లాంటి నాయకుడు ఉండ డం ప్రజల అదృష్టమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. చింతగట్టు క్యాంపులోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో 53, 54 డివిజన్ల బీఆర్ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, హనుమకొండ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ హైదరాబాద్ తర్వా త హనుమకొండ నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. అలాగే, పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు రానున్నాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో ఉన్న ప్రతి ఆడబిడ్డకు మేన మామలా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. వినయ్‌భాస్కర్‌కు తన సహాయ సహకారాలు ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ర్టానికి ఎన్నో అవార్డులు దక్కాయని వివరించారు.
ఉద్యమంలో వరంగల్ కీలకం..
వరంగల్ అంటే సీఎం కేసీఆర్‌కు చాలా ఇష్టమని, తెలంగాణ ఉద్యమంలో వరంగల్ కీలకమని మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. 25 ఏండ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే జయశంకర్ సార్ చూసే వారని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కొట్లాడి రామప్పకు యునెస్కో గుర్తింపు తెచ్చారని గుర్తుచేశారు. పంజాబ్, హర్యానాతో పోల్చుకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నం పెట్టేస్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. దేశంలోనే పింఛన్ తీసుకునే వారు కేసీఆర్ వైపు చూస్తున్నారని సూచించారు. 8 నెలలు కష్టపడి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ప్రజలే నా బలగం..
నియోజకవర్గ ప్రజలే తన బలగం అని, బీఆర్ఎస్ కార్యకర్తలే తన కుటుంబం అని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. గతంలో తెలంగాణ రాక ముందు రూ.5 కోట్ల నిధులు తీసుకురాని పరిస్థితి ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పశ్చిమ నియోజక వర్గంలోని ప్రతి కాలనీకి డ్రైనేజీలు, సీసీ రోడ్లు, నీళ్లు, ప్రతి ఇంటింటా సంక్షేమ పథకాలు అందించి అభివృద్ధి చేశానని చెప్పారు. గత పాలకులు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసి నాణ్యమైన విద్యనందిస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేసిన నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు.
పార్టీ కోసం పనిచేయాలి..
జాతీయ స్థాయిలో తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయని హనుమకొండ ఇన్చార్జి, ఎమ్మె ల్సీ ప్రభాకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితులు ఉండేవన్నారు. స్వరాష్ట్రంలో ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారన్నా రు. తెలంగాణే కాదు దేశం కూడా బాగుపడాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారన్నారు. కార్యకర్తలు సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరారు. రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, కార్పొరేటర్లు సోదా కిరణ్, గుంటి రజిత, మాజీ కార్పొరేటర్ మాడిశెట్టి శివశంకర్, సోదా రామకృష్ణ పాల్గొన్నారు.