హనుమకొండ(ఐనవోలు) : కన్న తల్లిని చూడడానికి వస్తూ అన్నదమ్ములు ఇద్దరు మృత్యు ఒడిలోకి చేరిన హృదయ విధారకమైన సంఘటన ఐనవోలులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన శాగంటి శంకరయ్య, యాదమ్మ దంపతులుకు నలుగురు సంతానం. పెద్ద కుమారుడు శాగంటి సురేందర్ (48), రెండో కుమారుడు శాగంటి ప్రకాశ్ (46) అన్నదమ్ములు ఇద్దరు కూలీ పని చేసుకుంటూ హనుమకొండలో జీవిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 19న ఐనవోలు ఉంటున్న తల్లి యాదమ్మను చూడడానికి అన్నదమ్ములు ఇద్దరు హనుమకొండ నుంచి ఐనవోలుకు ద్విచక్రవాహనం పై బయలుదేరారు.
ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునే లోపే..
ఇంకో ఐదు నిమిషాలు అయితే ఇంటికి చేరుకుంటామనె లోపు ఐనవోలు శివారు లక్ష్మీపురం స్టేజీ వద్ద రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్లో చేర్పించారు. కాగా, చికిత్స పొందుతూ ఈ నెల 20న శాగంటి ప్రకాశ్ మృతి చెందగా శాగంటి సురేందర్ బుధవారం రాత్రి మృత్యువాత పడ్డాడు. సురేందర్‌కు భార్య భాగ్య, ఇద్దరు కుమారులు నాగరాజు, నవనీత్, శాగంటి ప్రకాశ్ కు భార్య రమ ఉన్నారు.
పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాలు..
ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరు రెండు రోజుల వ్యవధిలో మృతి చెందడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పెద్ద దిక్కు కోల్పోయిన ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, రోడ్డు ప్రమాదంపై అయోమయం నెలకొంది. అయితే వీరి మృతి పట్ల పలు అనుమానాలను రేకిత్తిస్తున్నది. కుటుంబ సభ్యులు గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టినట్లుగా ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు మాత్రం సెల్ఫ్ స్కిడ్గా కేసు నమోదు నమోదు చేశారు. పోలీసులు కావాలని కేసును తప్పుతోవ పట్టిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రోడ్డు ప్రమాదం జరిగి నాలుగు రోజులు కావొస్తున్నా ఈ ప్రమాదం ఎలా జరిగిందో అనేది ప్రశ్నార్ధకంగానే మిగిలింది.? పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.