వరంగల్ చౌరస్తా, అక్టోబర్ 10: వరంగల్లోని ఎంజీఎం దవాఖాన చరిత్రలో మరో ఘనత చోటుచేసుకుంది. రెండు సంవత్సరాల ఆరు నెలల వయస్సున్న బాలుడికి అరుదైన, క్లిష్టమైన బ్రాంకోస్కోపీ శస్త్రచికిత్సను ఈఎన్టీ (చెవి, ముక్కు, గొంతు) విభాగం, అనస్థీషియా వై ద్యుల బృందం విజయవంతంగా నిర్వహించింది. ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చిలుక మురళి తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన బాలుడు అబ్దుల్ సమద్ వారం రోజులుగా దగ్గు, ఆయాసంతో బాధపడుతుండడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 9న ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు.
పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఊపిరితిత్తుల్లో సమస్య ఉన్నట్లుగా గుర్తించారు. అనంతరం సీటీ స్కాన్ నిర్వహించి ఊపిరితిత్తుల్లో కుడి వైపున అత్యంత క్లిష్ట భాగంలో వేరుశగన పప్పు ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. ఈఎన్టీ విభాగం మొదటి యూనిట్ డాక్టర్ వెంటకరత్నం బృందం, అనస్థీషియా డాక్టర్లు జాషువా, రాంలాల్ ఆధ్వర్యంలో బ్రాంకోస్కోపీ విధానంలో విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేసి వేరుశనగ పప్పును బయటకు తీసి బాలుడి ప్రాణాలు కాపాడారు.
అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యుల బృందాన్ని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చిలుక మురళి, పలువురు విభాగాధిపతులు అభినందించారు. ఎంజీఎం చరిత్రలో బ్రాంకోస్కోపీ విధానంలో మొదటి శస్త్ర చికిత్స అని, ప్రైవేట్ దవాఖానలో రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. కాగా, వైద్య బృందానికి బాలుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.