హనుమకొండ/చెన్నారావుపేట, జూలై 29 : డెంగీ లక్షణాలతో మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని చక్రవర్తి హాస్పిటల్లో చేరిన బాలుడు జీవన్(13) చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందగా, వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నారావుపేట మండలం బోడమాణిక్యం తండాకు చెందిన భూక్యా మోహన్-ఉమా దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. కుమారుడు జీవన్(13)కు వారం రోజుల నుంచి జ్వరం రావడంతో నర్సంపేటలోని ఓ దవాఖానలో చూపించారు.
డెంగీ లక్షణాలు కనిపించగా మెరుగైన వైద్యం కోసం బాలసముద్రంలోని చక్రవర్తి దవాఖానకు తీసుకురాగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. జ్వరం తగ్గుతుందని హనుమకొండలోని ఆస్పత్రికి వస్తే వైద్యుల నిర్లక్ష్యంతో తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. హాస్పిటల్ ఎదుట ధర్నా చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న సుబేదారి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గొడవలు జరుగకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు.
ఈ విషయంపై దవాఖాన డాక్టర్ తరుణ్రెడ్డిని ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సాంబశివరావు ఆదేశాల మేరకు అదనపు డీఎంహెచ్వో ఆస్పత్రికి వెళ్లి విచారణ చేసినట్లు సమాచారం. బాలుడి మృతిలో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్న కుమారుడు చిన్న వయసులోనే మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.