నల్లబెల్లి, జూన్ 9 : ఓ మహిళ కులం పేరుతో దూషించి విచక్షణ లేకుండా కర్రతో చితకబాదడంతో తట్టుకోలేక ఓ బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపూర్లో సోమవారం జరిగింది. మృతుడి తల్లి బెల్ల లక్ష్మి కథనం ప్రకా రం.. కొండాపూర్ గ్రామానికి చెందిన బెల్ల శ్రీకాంత్(14) ఇంట్లో ఆదివారం మేకను కోయగా రక్తం అంటిన చేతులను తన ఇంటి సమీపంలో ఉన్న కోల కొమురమ్మకు చెందిన నీటి తొట్టిలో కడిగాడు.
అయితే రక్తం మరకల చేయిని తమ నీటి తొట్టిలో ఎలా కడుగుతావంటూ కులం పేరుతో సంబోధిస్తూ కర్రతో విచక్షణారహితంగా బాలుడిని కొట్టింది. ఆ అవమానం భరించలేక బాలుడు ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు నర్సంపేట ఏరియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. బాలుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు.