ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను అడ్డగోలుగా దోచుకుంటున్నాయి. అడ్డూఅదుపూ లేకుండా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రకర కాల పేర్లు చెప్పి దోపిడీకి పాల్పడుతున్నాయి. విద్యా సంస్థల ఆవరణలోనే బుక్స్, యూనిఫాం, తదితర సామగ్రి అధిక ధరలకు విక్రయిస్తున్నాయి. పాఠశాలల్లో కనీస వసతులు కరువయ్యాయి. దాదాపు ప్లేస్కూళ్లన్నీ అపార్ట్మెంట్లలోనే నడుస్తున్నాయి. ప్రైవేట్ బడులు పుట్టగొడుగులా పెరిగిపోతున్నా విద్యాశాఖాధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
– హనుమకొండ చౌరస్తా/ మహబూబాబాద్ రూరల్/మరిపెడ, జూన్ 27
ఫీజు మొత్తం ఈనెల 30లోగా చెల్లిస్తే పుస్తకాలు, స్కూల్ డ్రెస్‌లు ఫ్రీ అంటూ ప్రైవేట్ స్కూళ్లు ఆఫర్ పేరిట ఊరిస్తున్నాయి. లేదంటే బుక్స్‌కు, డ్రెస్‌లకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్, ఇంటర్నేషనల్ బడులు దరఖాస్తు ఫారానికే రూ.1000 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఏరియాను బట్టి రూ. 30 వేల నుంచి 90 వేల వరకు తీసుకుంటున్నాయి. అదనంగా బుక్స్, షూ, టై, బెల్ట్, ఐడీ కార్డ్, ట్రావెల్ బస్సు, యూనిఫామ్, డ్యాన్స్ క్లాస్ పేరిట దోపీడీ చేస్తున్నాయి. ఆహ్లాద వాతావరణంలో చిన్నారులకు ఆటపాటలు నేర్పించాల్సిన ప్లే స్కూల్స్ అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. మూసివేసిన స్కూళ్లకు మళ్లీ ఎటువంటి అనుమతి తీసుకోకుండా పేర్లు మార్చి నడిపిస్తున్నారు. కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సరైన ప్లే గ్రౌండ్, ఆట పరికరాలు లేక క్రీడలకు దూరమవుతున్నారు. సరిపడా టాయ్లెట్లు లేక ఒంటికీ అవస్థలు పడుతున్నారు. అర్హత గల ట్రైనింగ్ టీచర్లను నియమించకపోవడంతో విద్యా బోధన అంతంత మాత్రంగానే ఉంది.
మహబూబాబాద్ రూరల్ : పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఎలాంటి అనుమతులు లేకుండా పుస్తకాలు, నోట్‌బుక్స్ అమ్ముతుండగా విద్యాశాఖాధికారులు తనిఖీ చేసి సుమారు రూ.15 లక్షల విలువ చేసే పుస్తకాలు సీజ్ చేశారు. స్కూల్లో బుక్స్ అమ్ముతుండగా డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎంఈవో వెంకటేశ్వర్లు సందర్శించారు. అక్రమంగా అమ్ముతున్న పుస్తకాలు, నోట్‌బుక్స్, సామాన్ల గదిని ఆయన సీజ్ చేసినట్లు సంఘం రాష్ట్ర నాయకులు సాయి కుమా ర్, సూర్యప్రకాశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో జవహర్లాల్, రమేశ్, దీపక్, మహేందర్, చరణ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుకాలు, నోట్‌బుక్స్, స్టడీ మెటీరియల్‌ను అధిక ధరలకు అమ్ము తున్నారు. నిబంధనల ప్రకారం పాఠశాల స్టేషనరీ, నోట్ బుక్, యూనిఫామ్‌లు వంటివి పాఠశాలలో విక్రయించరాదు. కానీ వాటిని అక్కడే కొనమని తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నారు. కొన్ని చోట్ల పుస్తకాల విక్రయదారులతో ఒప్పందం చేసుకొని కమీషన్లు తీసుకుంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి పుస్తకాల సెట్ ధర సుమారు రూ. 6937లు ఉండగా, అదే బహిరంగ మార్కెట్లో రూ. 1200 నుంచి రూ.2200 ధర వరకు లభిస్తున్నది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలి. యాజమాన్యాల తీరుతో నిరుపేద విద్యార్థులు చదువులకు దూరం అవుతుండ్రు. ప్రత్యేకమైన పర్యవేక్షణ టీం లేకనే ఇష్టం వచ్చిన విధంగా ఫీజులు గుంజుతుండ్రు. ప్రతి పాఠశాలలో టీచర్లు, ఫీజులకు సంబంధించిన పట్టిక ఉండాలి. ఎటువంటి అనుమతులు లేకుండా తరగతి గదులు, సొంత రూంలను ఏర్పాటు చేసుకుని ఎక్కువ రేట్లకు బుక్స్, నోట్స్, యూనిఫామ్ అమ్ముతున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. ఫీజుల దోపీడీ చేస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
-సూర్యప్రకాశ్, డీఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడు