న్యూశాయంపేట, మార్చి 2: మామునూరుకు ఎయిర్‌పోర్టు తామే తీసుకొచ్చామంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు కొట్లాడుకోవడం చూస్తుంటే నవ్వొస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఎద్దేవా చేశారు. ఆదివారం హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ వినోద్‌కుమార్ మాట్లాడుతూ మామునూరు ఎయిర్‌పోర్టుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, సీఎం రేవంత్‌రెడ్డి తాను తీసుకొచ్చానని చెప్పుకోవడం తెలంగాణ ప్రజలు, ఉద్యమాన్ని, ఉద్యమకారులను కించపర్చడమేనని పేర్కొన్నారు.
రెండో ప్రపంచయుద్ధం జరిగే సమయంలో ఇక్కడ ఎయిర్ స్ట్రిప్‌గా ఏర్పాటు చేశారని చెప్పారు. తాను సూల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు 1976-78 కాలంలో వాయుదూత్ సర్వీస్ నడిచేదని 1980 తర్వాత మూతపడిందని గుర్తుచేశారు. ఎన్సీసీ, ఎయిర్‌ఫోర్స్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేవారని, ఆ రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టి ఉంటే మామునూరు ఎయిర్‌పోర్టు మరోలా ఉండేదని, చిత్తశుద్ధి లేక ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముగా మారిందని మండిపడ్డారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే అప్పటి కేంద్ర మంత్రి ప్రఫుల్ పటేల్‌కు ప్రశ్న రాస్తే.. శంషాబాద్‌కు 150 కి.మీ దూరంలో పెట్టొద్దని జీఎంఆర్ సంస్థకు 25 ఏళ్లు రాసిచ్చామని 2005-2006లో రిైప్లె వచ్చిందని ఆ అగ్రిమెంట్ మేరకు అందరూ ఆగిపోయారన్నారు.
అయితే తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజుల్లోనే మొదటి సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్టు కోసం కృషిచేశారని జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుందని ప్రయత్నించి వారిని ఒప్పించామన్నారు. ఈ క్రమంలో కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరిని కేటీఆర్‌తో కలిసి వెళ్లి మామునూరు అంశంపై మాట్లాడి ఒప్పించామని వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. కానీ బీఆర్ఎస్ కృషి లేదని బీజేపీ, కాంగ్రెస్‌లు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయని తాము చేసిన ప్రయత్నాలు చెప్పాల్సిన అవసరం లేదని.. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో రోజూ లక్ష మంది ప్రయాణిస్తున్నారని, అది బాంబేను అధిగమిస్తున్నదన్నారు.
హైదరాబాద్ ఎయిర్‌పోర్టు ఇంటర్నేషనల్ హబ్ కాబోతున్నదని, ఈ క్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు సేవలందించేందుకు మామునూరు ఎయిర్పోర్ట్ కీలకం కానున్నదని వివరించారు. ఫ్లయింగ్ ట్రైయినింగ్ ఆర్గనైజేషన్ మామునూరుకు తీసుకురావాలని బోయింగ్, ఎయిర్ బస్, ఇండిగో లాంటి సంస్థల విమానాల రిపేరింగ్ సెంటర్ల వరంగల్ తీసుకురావాలని రేవంత్ సరారును డిమాండ్ చేశారు. నాగ్‌పూర్, అమరావతికి ఫ్లయింగ్ ట్రైయినింగ్ ఆర్గనైజేషన్ తీసుకెళ్లాలని పోటీ పడుతున్నాయని పన్ను రాయితీలు ఇచ్చి మామునూరుకు తీసుకురావాలన్నారు.
వాయుదూత్లా నాలుగు విమానాలు నడిపి ఇకడ విమానాలు నడుస్తలేవని మూసివేసేలా చేయొద్దని, ఈ ప్రాంతంలో బీజేపీ నుంచి 8మంది ఎంపీలు ఉన్నారని నొక్కి చెప్పారు. నిధులు కేటాయించేలా కృషిచేయాలన్నారు. 253 ఎకరాలు బీఆర్ఎస్ హయాంలోనే గుర్తించి రైతులతో సంప్రదింపులు జరిపామని, మామునూరు ఎయిర్‌పోర్టు క్రెడిట్ వీసమెత్తు కూడా రేవంత్‌రెడ్డికి దకదన్నారు. ఇది 15 ఏళ్ల పోరాట ఫలితమని చెప్పి ఉంటే తాము మాట్లాడే వాళ్లం కాదని చెప్పారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, జడ్పీ మాజీ చైర్మన్ సుధీర్‌కుమార్, కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు, నాయకులు నిమ్మగడ్డ వెంకన్న, పులి రజనీకాంత్, జోరిక రమేశ్ పాల్గొన్నారు.
మామునూరులో తిరిగి విమనాశ్రయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని 2019 జూలైలోనే ఉమ్మడి పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ సభ్యుడిగా, స్టాండింగ్ లేబర్ కమిటీ మెంబర్‌గా ఉన్నప్పుడే ఈ అంశాన్ని లేవనెత్తానని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ తెలిపారు. నగరంలోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. మామునూరుతో పాటు ఆదిలాబాద్, రామగుండంలోని విమానాశ్రయాలను పునరుద్ధరించాలని గతంలోనే కేంద్రాన్ని కోరానని చెప్పారు. ప్రస్తుతం కేంద్రం మామునూరు విమానాశ్రయం పనులు ప్రారంభించేలా నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి, సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలు ఏనాడు వరంగల్‌ను పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రం సాధించడమే కాకుండా వరంగల్ కోసం కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉకుకర్మాగారం అంశాలను విభజన చట్టంలో పొందుపరిచేలా చేసిన గొప్పనాయకుడు కేసీఆర్. వీటన్నింటికీ కనెక్టివిటీ ఉండాలని తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పటి సీఎం కేసీఆర్ 2014లోనే ఎయిర్‌పోర్ట్‌ను పొందుపర్చారు.
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు టెక్స్టైల్ పార్ ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ సర్కారు కృషి, ఒత్తిడి ఫలితంగానే ఎయిర్‌పోర్టుకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. కానీ, చేయని పనులను మేమే చేశామని బీజేపీ, కాంగ్రెస్‌లు చెప్పుకోవడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలను మభ్యపెట్టే పనులు చేయకండి. మీకు దమ్ముంటే.. బయ్యారంలో ఉకు పరిశ్రమ చేపట్టండి. వరంగల్‌లో 24 అంతస్తుల దవాఖానకు నిధులు తీసుకురండి. మేము చేసిన పనులు మీరే చేశామని చెప్పుకోవడం మంచిది కాదు.
– దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
కాంగ్రెస్ నాయకుల తీరు విచిత్రంగా ఉంది. పనిచేసింది ఒకరైతే మేమే తెచ్చామని చెప్పుకొంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైంది. కాంగ్రెస్ తీరు మందికి పుట్టిన బిడ్డ మా బిడ్డ అన్నట్లుంది. కేసీఆర్ నాయకత్వంలో మేమంతా టెక్స్టైల్ పార్, మామునూరు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ కోసం కష్టపడ్డాం. కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల కృషికి ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది. మామునూరు చుట్టుపకల భూములు ఎకరా రూ.4-5 కోట్లు పలుకుతున్నా యి.
పరకాల నియోజకవర్గంలో ఎయిర్‌పోర్టు కోసం పోయే భూములకు మంత్రి సురేఖ బాధ్యత వహిస్తారా? లేకపోతే ఎమ్మెల్యే రేవూరి బాధ్యత వహిస్తారా? వాళ్లిద్దరికీ ఒకరంటే ఒకరికి పడదు. ఆనాడు టెక్స్టైల్ పార్ కోసం భూమికి మూ డింతలు ధర ఇచ్చాం. మామునూరు విషయంలో భూ మికి భూమి ఇవ్వాలి. 2019లో చదరపు గజానికి రూ.4వేల చొప్పున ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఇచ్చాం. ఎయిర్‌పోర్టు దగ్గర ఒక గుంట అమ్మితే వచ్చే డబ్బులు కూడా ఎకరానికి ఇచ్చే పరిస్థితి లేదు. ఇంటికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.
– చల్లా ధర్మారెడ్డి, పరకాల మాజీ ఎమ్మెల్యే