వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 20 : ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో రక్త నిధి నిల్వలు అట్టడుగుకు చేరుకుంటున్నాయి. అత్యవసర స్థితిలో ప్రాణాలు కాపాడాల్సిన బ్లడ్ బ్యాంక్‌లో ఇప్పుడు రక్తం దొరకని దుస్థితి నెలకొన్నది. రక్తదాతలను ప్రోత్సహించాల్సిన మోటివేటర్లు కరువవ్వడం, రక్తదాన శిబిరాల నిర్వహణలో అధికారులు ఘోరంగా విఫలమవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీనిని అదనుగా చేసుకొన్న కొన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాం కులు నిబంధనలను తుంగలో తొక్కి వ్యాపారానికి తెరలేపా యి. ఎంజీఎంలో రక్తం దొరకకపోవడంతో పేద రోగులు,
అటెండెంట్లు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులను ఆశ్రయించి రూ. వేలకు వేలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంజీఎంహెచ్ బ్లడ్ బ్యాంక్ సేవలను విస్తరిస్తూ రెట్టింపు నిల్వ సామర్థ్యాన్ని, ఆధునిక యంత్ర పరికరాలను, ప్రత్యేక వాహనాన్ని అందించారు. దీంతో కరోనా కాలంలో నిలిచిపోయిన శస్త్ర చికిత్సలను లాక్డౌన్ అనంతరం నిర్వహించే సమయానికి అవసరానికి సరిపడా రక్తాన్ని నిల్వ చేసుకున్నది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్ర భుత్వ సహకారం లేకపోవడంతో పేద, మధ్య తరగతి కు టుంబాలకు ప్రభుత్వ వైద్యంపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు రక్తదాన శిబిరాలు నిర్వహించి సేకరించిన యూనిట్లలో కనీసం 30 శాతం ఎంజీఎం బ్లడ్ బ్యాంకుకు అందించాల్సి ఉంటుంది. అయితే ఈ ఉత్తర్వులు అమలు కావడం లేదు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లోని ఎనిమిది (రెడ్ క్రాస్తో పాటు) ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఎంజీఎంకు ఇవ్వాల్సిన రక్తంతో వ్యాపారం చేస్తున్నాయి.
రక్తం నిల్వ చేయడానికి వినియోగించే బ్లడ్ బ్యాగుల ఖరీదు ఎక్కువగా ఉండడంతో ఎంజీఎంహెచ్‌లో ఉచితంగా రెండు యూనిట్లు అందిస్తూ అదనపు ఒక్కో యూనిట్‌కు రూ. 1,050 చార్జీ చేస్తున్నారు. ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు మాత్రం ఎక్స్చేంజ్ పేరుతో దాత నుంచి ఒక యూనిట్ రక్తం తీసుకొని అదనంగా రూ. 1500 నుంచి రూ. 2వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం, దవాఖాన ఉన్నతాధికారులు స్పందించి రక్త నిల్వలను సమకూర్చడంతో పాటు, అక్రమ వ్యాపారాన్ని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఎంజీఎం హాస్పిటల్లో రక్తనిధి కేంద్ర నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కనిష్ఠంగా 1000, గరిష్ఠంగా 1,200 యూనిట్లు నిల్వ చేసుకొనే సామర్థ్యంతో, సీకేఎం హాస్పిటల్, హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి దవాఖాన పరిధిలోని రక్త నిల్వ కేంద్రాలకు ఎంజీఎం మదర్ బ్లడ్ బ్యాంక్‌గా సేవలందిస్తున్నది. ఇంతటి వినియోగం ఉన్నా అందులో కనీసం 20 శాతం నిల్వలు కూడా లేవు. నిత్యం పదుల సంఖ్యలో శస్త్ర చికిత్సలు జరుగుతుంటాయి. ప్రతిరోజు ఎంజీఎంలో సుమారు 30 నుంచి 50 యూనిట్లు అవసరముంటాయి.
అయినా బ్లడ్ బ్యాంకులో మోటివేటర్లు లేకపోవడంతో సేవ, వ్యాపార, వాణిజ్య, అసోసియేషన్స్, యూనియన్లు, కళాశాలల్లో క్యాంపులు నిర్వహించలేక కనీస నిల్వలతో కొనసాగించడం కష్టంగా మారుతున్నదని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికైనా హాస్పిటల్ డెవల్మెంట్ కమిటీ చైర్పర్సన్, కలెక్టర్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఉత్తర్వులు జారీ చేస్తే ఎంజీఎంహెచ్‌లో రక్తం యూనిట్లు కొంతైనా అందుబాటులోకి వచ్చే అవకాశముంటుందని అంటున్నారు.
మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుంది ఎంజీఎంహెచ్‌లో రోగుల పరిస్థితి. వైద్యులు, సిబ్బంది కొరతతో అందుతున్న అరకొర సేవలను సర్దుకునే లోపే ఎమర్జెన్సీ వార్డ్ ల్యాబ్‌లో పరికరాలు పాడయ్యాయి. దీంతో పారా మెడికల్ సేవలు నిలిచిపోయి రోగులు, అటెండెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధిక మందికి నిర్వహించే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్ (ఏబీజీ) పరీక్షల కోసం సేకరించిన నమూనాలను పాథాలజీ (91 ల్యాబ్)కి తరలిస్తుండడంతో రిపోర్టులు సైతం అలస్యంగా అందుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాథాలజీ ల్యాబ్‌లోనూ పరీక్షల నిర్వహణ సామర్థ్యానికి అవసరమైన యంత్ర పరికరాలు లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తున్నదని రోగులు, అటెండెంట్లు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యంత్ర, పరికరాలకు మరమ్మతు చేయించాలని, ఆధునిక ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.