Tobacco Products | ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే పొగాకు వినియోగం ఎముకలు, వెన్నెముక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుందనే విషయం చాలా మందికి తెలియదు. సిగరెట్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల్లో ఉండే హానికర రసాయనాలు శరీరంలోని ఎముకల బలాన్ని తగ్గించి, గాయాలు లేదా విరిగిన ఎముకలు మానుకునే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయి. ఎముకలు నిరంతరం పునరుద్ధరణ చెందుతూ ఉండే జీవ కణజాలం. అయితే పొగాకు వినియోగం ఈ సహజ ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. ముఖ్యంగా నికోటిన్, ఇతర రసాయనాలు ఎముకలు, వాటికి మద్దతు ఇచ్చే కణజాలాలకు రక్తప్రసరణను తగ్గిస్తాయి. గాయాల తర్వాత లేదా శస్త్రచికిత్స అనంతరం ఎముకలు త్వరగా కోలుకోవడానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు సరైన మోతాదులో అందకపోవడంతో సమస్యలు తలెత్తుతాయి.
ధూమపానం చేసే వారిలో ఎముక విరిగిన తరువాత అతుక్కునేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కొన్నిసార్లు విరిగిన ఎముకలు పూర్తిగా అతుక్కోకపోవడం కూడా జరుగుతుంది. దీనిని వైద్యపరంగా నాన్-యూనియన్ అని పిలుస్తారు. శస్త్రచికిత్సలు ఎంత విజయవంతంగా జరిగినా, పొగాకు వినియోగం కొనసాగితే ఎముకల పునరుద్ధరణ ప్రక్రియ మందగించే అవకాశం ఉంటుంది. పొగాకు ప్రభావం ఎముకలకే పరిమితం కాదు. వెన్నెముక ఆరోగ్యంపైనా ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. వెన్నెముక ఎముకల మధ్య ఉండే డిస్కులు శరీరానికి కుదుపులను తట్టుకునే సామర్థ్యాన్ని ఇస్తాయి. అయితే ధూమపానం వల్ల ఈ డిస్కులకు సరైన పోషణ, తేమ అందకపోవడంతో అవి త్వరగా దెబ్బతింటాయి. దీని ఫలితంగా వెన్నునొప్పి, డిస్క్ ప్రోలాప్స్, నరాలపై ఒత్తిడి వంటి సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్యంగా యువతలో కనిపించే నడుము నొప్పికి కూడా పొగాకు వినియోగం ఒక కారణంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పొగాకు వల్ల వచ్చే మరో ప్రధాన సమస్య ఆస్టియోపోరోసిస్. ఈ పరిస్థితిలో ఎముకల సాంద్రత తగ్గి అవి పెళుసుగా మారుతాయి. కాల్షియం శోషణ సామర్థ్యం తగ్గిపోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువకాలం పొగాకు వినియోగించే పురుషుల్లో కూడా ఇదే ప్రమాదం ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ కారణంగా చిన్నపాటి ప్రమాదాలకే తుంటి, వెన్నెముక, మణికట్టు ఎముకలు విరిగే అవకాశం పెరుగుతుంది. సిగరెట్లకు బదులుగా గుట్కా లేదా నమిలే పొగాకు ఉత్పత్తులు వాడటం సురక్షితం కాదని నిపుణులు చెబుతున్నారు.
పొగను పీల్చకపోవడం వల్ల హాని తక్కువగా ఉంటుందని చాలామంది భావించినప్పటికీ, నికోటిన్ శరీరంలోకి ఏ రూపంలో చేరినా ఎముకల జీవక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అయితే పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానేస్తే శరీరం మళ్లీ కోలుకునే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఎముకల శస్త్రచికిత్సలకు ముందు లేదా విరిగిన తరువాత చేసే చికిత్స సమయంలో పొగాకు మానేసిన వారిలో గాయాలు త్వరగా మానడంతోపాటు సమస్యలు కూడా తక్కువగా కనిపించాయి. తరచూ వెన్నునొప్పి, పదేపదే ఎముకలు విరగడం లేదా ఎముకల బలహీనత వంటి సమస్యలు ఎదురవుతున్నవారు తమ పొగాకు అలవాట్లను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా సందర్భాల్లో ఆరోగ్య సమస్యల వెనుక కనిపించని ప్రధాన కారణాల్లో పొగాకు వినియోగం కూడా ఒకటిగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.