పోచమ్మమైదాన్, ఫిబ్రవరి 2 : రెండేళ్ల నుంచి తమకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా, మభ్యపెడుతూ, మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలువురు భవితశ్రీ చిట్‌ఫండ్ బాధితులు ఆదివారం వరంగల్ బ్యాంకు కాలనీలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ ఇంటి ఎదుట కుటుంబ సభ్యులతో నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా బాధితుడు కీర్తిమోహన్ మాట్లాడుతూ.. 2018లో రూ.10 లక్షలు, రూ. 5 లక్షలు, రూ. 3 లక్షలు, రూ. 2 లక్షలకు చిట్టీలు వేస్తే, 2022లో పూర్తయినా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఆర్థికంగా నష్టపోతున్న తాము విసిగిపోయి నిరాహార దీక్ష చేస్తున్నామని, సోమవారం కూడా కొనసాగిస్తామన్నారు. అధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. దీక్షలో మోహన్‌తోపాటు వరంగల్, నర్సంపేట, యాదాద్రి భువనగిరికి చెందిన బాధితులు శోభ, శ్యాంసుందర్, మహేందర్, వెంకటేశ్, వెంకటలక్ష్మి, శివప్రసాద్ పాల్గొన్నారు.