వరంగల్, సెప్టెంబర్ 24 : భద్రకాళీ అమ్మవారు బుధవారం గాయత్రీ మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. మూడో రోజు ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగాయి. తెల్లవారు జామున అర్చకులు నిత్యాహ్నికం నిర్వహించిన అనంతరం అమ్మవారిని గాయత్రీ మాతగా అలంకరించారు. ఉదయం చంద్రఘంటా క్రమంలో సింహ వాహనసేవ, సాయంత్రం మహిషాసుర మర్థిని దుర్గా క్రమంలో గజ వాహనంపై ఊరేగించా రు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో మహాన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఈవో రామల సునీత ఏర్పాట్లు పర్యవేక్షించారు. సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.