కృష్ణకాలనీ, జూన్ 17 : జిల్లాకేంద్రంలోని భాస్కర్‌గడ్డలో కేసీఆర్ ప్రభుత్వం 2023 అక్టోబర్‌లో తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ లబ్ధిదారులు సోమవారం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. 462 ఇండ్లకు 392 మందిని గుర్తించి కలెక్టర్ సమక్షంలో డ్రా పద్ధతిలో ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ రావడంతో ఇంటి పట్టాలు ఇవ్వలేదని, కోడ్ ముగియగానే ఇస్తామని కలెక్టర్ చెప్పారని తెలిపారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిసినా ఫలితంలేదని వాపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వానిది కక్ష సాధింపు చర్య అని బీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. ఇండ్ల పట్టాల కోసం లబ్ధిదారులు చేస్తున్న ధర్నాకు ఆమె సంఘీభావం తెలిపారు. రెండు గంటలపాటు వారితో ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొంతమంది అధికార పార్టీ నాయకులు అక్రమంగా ఇండ్లను తీసుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ లబ్ధిదారులకు పట్టాలివ్వకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై లబ్ధిదారులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లగా ఎంపిక చేసిన వారిలో అర్హులు లేరని, రీ సర్వే చేసి మళ్లీ కేటాయిస్తామంటూ ఆరు నెలలుగా తిప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సర్వే చేసి నాలుగు నెలలవుతున్నా ఇప్పటి వరకు ఎవరి ప్రయోజనం కోసం లబ్ధిదారులను ఎంపిక చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా పేదలు ధర్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు.
ఎన్నికల సమయంలో దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనను పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల పంపిణీ, కరెంట్ సరఫరాలో అవకతవకలు జరిగాయంటూ కాలయాపన చేస్తున్నదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే తన తప్పును తెలుసుకొని లబ్ధిదారులకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ హామీ ఇచ్చారని భూపాలపల్లి సీఐ నరేశ్ కుమార్ తెలుపగా, వారం రోజుల్లో పట్టాల్వికపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని గండ్ర జ్యోతి హెచ్చరించారు. ధర్నాలో పాల్గొన్న గండ్ర జ్యోతితో పాటు మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు, వైస్ చైర్మన్ గండ్ర హరీశ్‌రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నూనె రాజుపటేల్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్, నాయకులు గ డ్డం కుమార్‌రెడ్డి, కరీం, బీబీ చారి, బట్టు సంపత్, మేకల మల్లేశ్, శ్రీకాం త్ పటేల్, నాగుల దేవేందర్‌రెడ్డి, బుర్ర రాజు, కరాటే శ్రీనివాస్, ధర్మసమాజ్ పార్టీ నాయకులు, 200 మంది లబ్ధిదారులు పాల్గొన్నారు.