బచ్చన్నపేట, ఏప్రిల్ 28 : కార్మికుల హక్కుల సాధన కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకంగా పోరాడి సాధించికున్న దినమే మేడే పండుగ అని సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ వెంకటేష్ అన్నారు. సోమవారం బచ్చన్నపేటలోని సిపిఎం కార్యాలయంలో ఇంజ ఎల్లయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ..పనిగంటలు తగ్గించి, కార్మిక చట్టాలు అమలు చేయాలని నాడు అమెరికాలోని చికాగో పట్టణంలో వేలాది మంది కార్మికులు ఉద్యమించారు.
మే 1వ తేదీన వారి రక్తతర్పణంతో హక్కులను సాధించుకున్న దినాన్నే మేడేగా జరుపుకుంటున్నామని తెలిపారు. మేడే పండుగను సంఘటిత, అసంఘటితరంగా కార్మికులు జయప్రదం చేయాలని కోరారు. మే ఒకటవ తేదీన గ్రామ గ్రామాన ఎర్రజెండాలు ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ అన్యబోయిన రాజు, అశోక్ గంధమల్ల మనోహర్, బుర్రి సుధాకర్, ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.