కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన కులగణన లెక్కలపై బీసీలు భగ్గుమన్నారు. సర్వే అంతా తప్పుల తడకగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు, ఇప్పటికి చాలా వ్యత్యాసముందని మండిపడ్డారు. పెరగాల్సిన జనాభా ఎలా తగ్గిందంటూ ప్రశ్నిస్తున్నారు. అగ్ర కులాలకు కేటాయించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునేందుకే కుట్రలకు తెరలేపారని, ఓసీలకు తలొగ్గిన ప్రభుత్వం వారికి అనుకూలంగా సర్వే చేపట్టిందని ఆరోపించారు. బీసీల సంఖ్య ఎందుకు తగ్గింది? ఓసీల జనాభా ఎలా పెరిగింది? అనే లెక్కలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంత చేస్తున్నా బీసీల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. మళ్లీ పారదర్శకంగా కులగణన చేపట్టి దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక ఎన్నికలను నిర్వహించాలని సూచించారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామంటూ హెచ్చరించారు.
-నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 5
కావాలనే తక్కువ చూపారు
ఎల్కతుర్తి : కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే బీసీ జనాభాను తగ్గించి చూపే ప్రయత్నం చేసింది. సర్వే పూర్తిగా తప్పుల తడకగా చేసినట్లు జనాభా నిష్పత్తిని చూస్తే తెలుస్తున్నది. గతంలో కన్నా ఇప్పుడు బీసీలు ఎలా తగ్గుతారో ప్రభుత్వం స్పష్టం చేయాలి. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల లెక్క పక్కాగా తేలింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ కుల గణనను ఒప్పుకోం. వెంటనే ప్రభుత్వం మళ్లీ పారదర్శకంగా బీసీల కులగణన చేసి దానికి చట్టబద్ధత కల్పించాలి. అలాగే 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి.
– శ్రీపతి రవీందర్‌గౌడ్, సొసైటీ చైర్మన్, బీసీ సంఘం జిల్లా నాయకుడు
అగ్ర కులాలకు తలొగ్గిన కాంగ్రెస్
లింగాలఘనపురం : కుట్రల కాంగ్రెస్ తన నైజాన్ని కులగణన పేర బయట పెట్టుకుంది. సమాజంలో 60 శాతం బడుగులుంటే ఓసీల సంఖ్యను పెంచింది. ఈ లెక్కల్లో అగ్రవర్ణాలదే పైచేయి అయ్యింది. బీసీలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వం సరిగా పాలన చేయలేదు. కేసీఆర్ పాలనలో బీసీలకు సముచిత స్థానం దక్కింది. బడుగు, బలహీన వర్గాల సంఖ్య ఎక్కువగా ఉన్నా రాజ్యాధికారం మాత్రం ఎప్పుడూ అగ్రకులాలకే దక్కుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అగ్ర కులాలకు తలొగ్గి వారికి అనుకూలంగా సర్వే చేయించింది. 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి.
– సేవెల్లి సంపత్, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జనగామ జిల్లా
బీసీలను అణచివేసేందుకు యత్నం
నల్లబెల్లి : రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను అణగదొ క్కేందుకు రేవంత్ సర్కారు యత్నిస్తున్నది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేకు, ఇప్పటి సర్వేకు పొంతనే లేదు. బీసీ ఓట్లతో గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వారికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు. కనీసం మంత్రిగా పనిచే యని రేవంత్‌కు సీఎం పదవి ఇస్తే అనుభవం లేంది ఏం చేస్తడు. ఇలాంటి అవకాశం మల్లా వస్తదా ఏంది? వెలుగు ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అభివృద్ధి పేరుతో తెచ్చిన అప్పులు తలా పాపం తిలా పిడికెడు అన్న చందంగా పంచుకుంటుం డ్రు. ఇట్లాంటి పనులు మానుకొని స్థానిక ఎన్నికల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి.
– చెట్టుపల్లి దామోదర్‌రావు, ఆరె కుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, నల్లబెల్లి
సమగ్రంగా లెక్కలు తీయాలే..
జనగామ రూరల్ : ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు నష్టం జరుగుతున్నది. వాటిని అమలు చేసుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో 52 శాతం ఉన్న బీసీలను కాంగ్రెస్ 46 శాతంగా చూపెడుతున్నది. ఓసీ జనాభాను ఎక్కువగా, బీసీలను తక్కువగా చూపెట్టడం పెద్దకుట్ర. పైగా బీసీలకు 42 శాతం సీట్లు ఇస్తామని కాంగ్రెస్ చెబుతున్నది. పార్టీల పరంగా కాకుండా రిజర్వేషన్ ప్రకారం సీట్లు ఇవ్వాలి. బీసీ జనాభా ఏ కారణంతో తగ్గిందో ప్రజలకు చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం సమగ్రంగా లెక్కలు తీసి ఎవరెవరు ఎంత శాతమున్నారో ప్రకటించాలి.
– బక్క నాగరాజు యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, జనగామ జిల్లా
బీసీలకు అన్యాయం
ములుగు రూరల్ : కులగణనలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ సర్వే పూర్తిగా అసమగ్రంగా, బీసీల వాస్తవ జనాభాను తక్కువగా చూపే విధంగా రూపొందించబడింది. బీసీలను సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో బలహీనంగా చూపించేలా ఈ గణన జరిగింది. ప్రభుత్వం పారదర్శకంగా వ్యహరించి పునః సమీక్ష చేపట్టాలి. నిపుణుల ఆధ్వర్యంలో మరోసారి సమగ్ర సర్వే నిర్వహించాలి. బీసీలకు అన్యాయం జరిగితే న్యాయ పోరాటం చేస్తాం. హక్కులను కాపడే దిశగా అన్ని రాజకీయ, సామాజిక వర్గాలతో కలిసి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం.
– ఆచార్య సకినాల జీవన్చంద్ర, వ్యవస్థాపక అధ్యక్షుడు, నేషనల్ ఫోరం ఫర్ గుడ్ సొసైటీ, ములుగు
56 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
మహబూబాబాద్ రూరల్/వరంగల్, ఫిబ్రవరి 5 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ హక్కుల సాధన సమితి మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుగు కుమార్, రాష్ట్ర ఉప కార్యదర్శి నేదునూరి రాజమౌళి అన్నారు. బుధవారం మహబూబాబాద్, హనుమకొండ కలెక్టరేట్ల ఎదుట బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో అన్ని రంగాల్లో బీసీలు వెనుకబడి ఉన్నారని, రాబోవు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల్లో బీసీలకు 56 శాతం రిజర్వేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలన్నారు. దేశ జనగణనలో కుల గణన చేయాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలన్నారు.
రాష్ట్రంలో బీసీ జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. బీసీలకు సబ్సిడీ రుణాలు, బీసీ అట్రాసిటీ చట్టం, బీసీ కింద రూ. 25 లక్షలు అందించి, బీసీ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బత్తిని సదానందం, నాయకులు గుంటి రాజేందర్, ఏదునూరి వెంకట్రాజం, కేడల ప్రసాద్, దొమ్మాటి ప్రవీణ్‌కుమార్, మోడెం రాజేందర్, నాంపెల్లి లక్ష్మయ్య, నేదునూరి శ్రీనివాస్, చేరాలు అంకుషావలీ, రాంచందర్, వెలుగు శ్రావణ్, ప్రవీణ్, అశోక్, శ్రీనాథ్, రమేశ్, వికాస్, సత్యం, మురళీ, రాజు పాల్గొన్నారు. అలాగే బీసీల వాటాపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీసీ హక్కుల సాధన సమితి నాయకులు ధర్నా చేసి, డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.