పోచమ్మమైదాన్, జూన్ 13: నేటి టెక్నాలజీ యుగంలో యువత సినిమాలు, టీవీలకే పరిమితమవుతున్నారని, సమాజ మార్పు కోసం నాటకాలను ఆదరించాలని రిటైర్డు ప్రిన్సిపాల్, ప్రముఖ రచయిత బన్న అయిలయ్య కోరారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, ఎఫ్డీసీ, ఐక్యవేదిక పర పతి సంఘం సౌజన్యంతో వరంగల్ జిల్లా రంగస్థల కళాకారుల ఐక్యవేదిక 16వ ఉభయ రాష్ర్టాలస్థాయి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలు పోతన విజ్ఞాన పీఠంలో శుక్రవారం రాత్రి అట్టహాసంగా ఆరంభమయ్యాయి. ఈ సందర్భంగా అయిలయ్య మాట్లాడుతూ సమాజానికి మంచి చెబుతున్న నాటకాలను అందరూ ఆదరించాలన్నారు.
ప్రముఖ కవి గిరిజామనోహర్ మాట్లాడుతూ నాటకాలను ప్రజలు ప్రోత్సహించడం వల్ల సమాజంలో కొంతవరకైనా మార్పు వస్తుందని, ఇందుకు కళాపోషకులు కళాకారులకు ప్రేరణ కలిగించాలని కోరారు. రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం మాట్లాడుతూ నాటక రంగ పునరాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కళా పోషకుల ద్వారా సహాయం అందేలా చూస్తానన్నారు.
వరంగల్ జిల్లా నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు మాడిశెట్టి రమేశ్ మాట్లాడుతూ యువత నాటక రంగం వైపు మొగ్గు చూపడానికి ప్రభుత్వం నంది, గరుడ వంటి విశిష్ట సంస్థలు నిర్వహించిన నాటక పోటీల్లో ప్రదర్శన చేసిన వారికి సర్టిఫికెట్స్, భవిష్యత్‌లో ఉద్యోగాలకు తగిన కోటా కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా కాకతీయ నృత్య కళాక్షేత్రం డాక్టర్ వెంపటి శ్రావణి శిష్య బృందంతో శాస్త్రీయ నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షుడు డాక్టర్ కాజీపేట తిరుమలయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆత్మీయ అతిథి డాక్టర్ బండారు ఉమామహేశ్వర్రావు, నాగపురి సంజయ్‌బాబు, గడ్డం యుగంధర్ పాల్గొన్నారు.
చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ వారిచే రవీందర్‌బాబు రచన, దర్శకత్వంలో మా ఇంట్లో మహాభారతం నాటికను ప్రదర్శించారు. ఇందులో సమాజంలోని ప్రతి ఇంటిలో నెలకొన్న సమస్యల ఇతివృత్తాన్ని వివరించారు. నిజామాబాద్ తన్మయ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో చదువు నాటికను ప్రదర్శించారు. నేటి సమాజంలో చదువుకు ఉన్న విలు వలను వివరించారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు ఎన్ఎస్ఆర్ మూర్తి, వేముల ప్రభాకర్, జేఎన్ శర్మ, ఆకుతోట లక్ష్మణ్, సాధుల సురేశ్, బీటవరం శ్రీధరస్వామి, కుసుమ సుధాకర్, కుడికాల జనార్దన్, మాలి విజయ్‌రాజ్, జూలూరు నాగరాజు, సీత వెంకటేశ్వర్లు, షఫీ, జక్కోజు సత్య నారాయణ పాల్గొన్నారు.