హనుమకొండ, జూన్ 24 : నగరంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని పలు భవనాల నిర్మాణ అనుమతుల మంజూరుతో పా టు భద్రకాళి, వడ్డేపల్లి బండ్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతుల మంజూరు కోసం రాంనగర్ ప్రాంతంలో భవనాన్ని పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. భీమారం ప్రాంతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ సమీపంలో ఉన్న భవనాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ కోసం పరిశీలించారు.
వర్షాలు కురుస్తున్న ప్రస్తుత తరుణంలో నయీంనగర్ నాలా లో ప్రవాహ తీరును పరిశీలించారు. అనంతరం పద్మాక్షి కాలనీలోని శ్రీరాంనగర్‌లో భవన నిర్మాణ అనుమతి కోసం స్థలాన్ని పరిశీలించారు. అలాగే, హంటర్‌రోడ్డు న్యూశాయంపేట ప్రాంతంలో దుర్గాదేవి కాలనీలో క్షేత్ర స్థాయిలో పర్యటించారు. మంకీ ఫుడ్ కోర్ట్ ప్రాంతం, ముకుంద అపార్ట్మెంట్ ప్రాంతాలను పరిశీలించిన కమిషనర్ అకడి స్థానికులు చొరవ తీసుకుంటే బేసిక్ రోడ్డు నిర్మాణానికి గల అవకాశాలను పరిశీలించాలని సిటీ ప్లానర్‌ను ఆదేశించారు. భవన నిర్మాణ అనుమతుల కోసం డాక్యుమెంట్ షార్ట్‌ఫాల్ ఉంటే వెంటనే సమర్పించాలని యాజమాన్యాలను ఆదేశించాలని సిటీ ప్లానర్‌కు కమిషనర్ సూచించారు. భద్రకాళి బండ్ ప్రాంతంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు.
బండ్‌పై గ్రీనరీ, లైటింగ్ పనులతో పాటు ఆట పరికరాలు, బాంక్వెట్ హాల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. వడ్డేపల్లి బండ్ పనులను పరిశీలించి, వేగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. కాంట్రాక్టర్‌తో సమావేశం నిర్వహించి, పనులు నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, సిటీ ప్లానర్ వెంకన్న, సీహెచ్‌వో శ్రీనివాసరావు, ఈఈలు శ్రీనివాస్, సంజయ్ కుమార్, డీఈలు సంతోష్‌బాబు, రవి కుమార్, పీఎంసీ ఆనంద్ ఓలేటి ఉన్నారు.
హనుమకొండ, జూన్ 24: నగరానికి చెందిన క్రెడాయ్(కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) నూతన పాలకవర్గ సభ్యులు శనివారం నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్లు నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఎర్రబెల్లి తిరుపతిరెడ్డి, జాయింట్ సెక్రటరీ జారతి మనోహర్, ఉపాధ్యక్షులు శాకమూరి అమర్, మందల రవీందర్, ట్రెజరర్ వెంకట మల్లారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ వరుణ్ అగర్వాల్, ఈసీ నెంబర్లు రఘువీర్, సలీం పాల్గొన్నారు.