తాడ్వాయి, ఫిబ్రవరి 10 : మేడారంలో ఆదివాసీ చిరు వ్యాపారులపై అదనపు కలెక్టర్ శ్రీజ అత్యుత్సాహం ప్రదర్శించారు. గద్దెల సమీపంలోని రోడ్లకు ఇరువైపులా ఉన్న షాపులను శుక్రవారం రాత్రి జేసీబీ సాయంతో కూల్చివేయించారు. వివరాలిలా ఉన్నాయి.. మహా జాతర సందర్భంగా గద్దెల సమీపంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఆదివాసీలు షాపులు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. జాతర దగ్గర పడుతున్నందున రోడ్లకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. దీంతో వారు శుక్రవారం సరుకులను ఖాళీ చేశారు. రాత్రి కావడంతో రేకులను శనివారం ఉదయమే తొలగిస్తామని పంచాయతీ అధికారులకు విన్నవించగా వారు ఒప్పుకున్నారు. కాగా, అదనపు కలెక్టర్ రాత్రి మేడారం చేరుకొని జేసీబీలు, వంద మంది పారిశుధ్య కార్మికులు, 50 మంది పోలీసులను వెంటబెట్టుకుని వ్యాపారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు ప్రారంభించారు.
విషయం తెలుసుకున్న ఆదివాసీ వ్యాపారులు అక్కడికి చేరుకుని షాపులను కూల్చవద్దని విన్నవించినా వినలేదు. రేకులు, బొంగులు, సిమెంట్ పోల్స్‌ను ధ్వంసం చేశారు. ఆగ్రహించిన వ్యాపారులు వాగ్వాదానికి దిగారు. అయినా వినకుండా అలాగే కూల్చివేతలు చేస్తుండడంతో ఆగ్రహించిన ఆదివాసీ వ్యాపారులు ఆందోళనకు దిగారు. దీంతో కూల్చివేతలు నిలిపివేసి వెళ్తుండగా తమకు న్యాయం చేయాలని కారును అడ్డుకున్నారు. ఇటీవల వచ్చిన వరదల వల్ల తీ వ్రంగా నష్టపోయామని, ఇప్పుడు మీవల్ల మరింత నష్టపోయామని తమకు న్యాయం చేసే వరకు ఆందోళన విరమించమని భీష్మించారు. ఏఎస్పీ సంకీర్త్ ఎంత చెప్పినా వినని వ్యాపారులు సీతక్క డౌన్‌డౌన్, పోలీసులు డౌన్‌డౌన్, కలెక్టర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితి చేయిదాటే అవకాశం ఉండడంతో పోలీస్ అధికారులు ఎస్పీ శబరీష్‌కు సమాచారం అందించారు. వెంటనే ఆయన మేడారానికి చేరుకొని వ్యాపారులు, పూజారుల సంఘం అధ్యక్షుడితో మాట్లాడారు. బాధితులను సముదాయించి నష్టాన్ని పూడుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. శనివారం మేడారం చేరుకున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ‘మేడారంలో అడిషనల్ కలెక్టర్‌కు బాధ్యతలు అప్పగించమని, తప్పు జరిగింది, క్షమించాలని’ వ్యాపారులు, పూజారులను కోరినట్లు సమాచారం.