గిర్మాజీపేట, డిసెంబర్ 1 : వృత్తి నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలకు అనేక ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వరంగల్ సెంట్రల్ క్రైం స్టేషన్ అసిస్టెంట్ కమిషనర్ డేవిడ్‌రాజ్ అన్నారు. గురువారం మండిబజార్‌లోని ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ సుపీరియర్ సిస్టర్ మేరీ అధ్యక్షతన నిరుపేద మహిళలకు మగ్గం శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అల్లికల విభాగంలో మహిళలకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.
డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ మాట్లాడుతూ.. మహిళలు నేర్చుకున్న శిక్షణతో వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో మై చాయిసెస్ ఫౌండేషన్ స్టేట్ కో ఆర్డినేటర్ జన్ను క్రాంతి, వరంగల్ సెంట్రల్ క్రైం స్టేషన్ సీఐ శ్రీనివాస్, ఎఫ్ఎంఎం సాంఘిక సేవా సంస్థ ప్రాజెక్టు అధికారి ఎర్ర శ్రీకాంత్, మేనేజర్ అజయ్‌కుమార్, మలుపు సంస్థ కో ఆర్డినేటర్ జన్ను అహరోన్ తదితరులు పాల్గొన్నారు.