రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మొట్టమొదటిసారిగా నేడు కాజీపేట జంక్షన్‌కు వస్తున్న నేపథ్యంలో ఆయనకు రైల్వేపరంగా పలు సమస్యలు స్వాగతం పలుకనున్నాయి. రైల్వే డివిజన్ ప్రతిపాదన కల నెరవేరేనా?, పీవోహెచ్ షెడ్డు దక్కేనా?, టౌన్ స్టేషన్లో ట్రయాంగిల్ ప్లాట్ఫారానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చేనా?, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యేనా? అని ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశ పడుతున్నారు. ఎలాంటి వరాలు కురిపిస్తారోనని
– కాజీపేట, జూలై18
కాజీపేట, జూలై18 : కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ శనివారం కాజీపేటకు రానున్న తరుణంలో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపులు, కొత్త రైళ్లు, అదనపు ప్లాట్‌ఫారాలు, పలు అభివృద్ధి పనులు, మౌలిక వసతుల ఏర్పాటుకు మోక్షం లభిస్తుందోనని ఈ ప్రాంత ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్‌కు కావాల్సిన అన్ని సౌకర్యాలున్నా గుర్తింపునకు నోచుకోలేకపోతున్నది. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ప్రస్తుతం సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు మాత్రమే ఉన్నాయి. ఈ జోన్‌కు మరో రైల్వే డివిజన్ ఏర్పాటు అవసరం ఉంది. డివిజన్‌స్థాయి గుర్తింపునకు కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్ ఇస్తారని స్థానికులు విశ్వసిస్తున్నారు. క్రూ కంట్రోల్ లాబీ నిర్వీర్యంపై కేంద్ర మంత్రి మౌనం వీడుతుందోనని లోకో రన్నింగ్ స్టాఫ్ కార్మికులు ఆశ పడుతున్నారు. జంక్షన్ పరిధిలో ఇప్పటికే ఎలక్ట్రికల్, డీజిల్, మెమొ షెడ్డులు అందుబాటులో ఉన్నాయి. పిరియాడికల్ ఓవరాలింగ్ హెడ్ (పీవోహెచ్) షెడ్డులో రైలింజన్లకు మరమ్మతులు చేపడతారు. అన్ని వనరులన్న కాజీపేటకు మంత్రి పీవోహెచ్ షెడ్డు కేటాయిస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు.
జంక్షన్ పరిధిలోని అయోధ్యపురంలో నిర్మిస్తున్న రైల్వే మల్టీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లో స్థానికులకు గ్రూప్ డీ ఉద్యోగ అవశాకాలు కల్పించాలని స్థానికుల నుంచి డిమాండ్ పెరుగుతున్న ది. గతంలో పంజాబ్‌లో స్థానికులకు ఇచ్చిన విధంగా స్థానికులు, భూనిర్వాసిత కుటుంబాల్లో ఇంటికొక్కరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని ఇప్పటికే రైల్వే జీఎం ఎస్కే శ్రీ వాస్తవకు పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, రైల్వే జేఏసీ, రైతులు వినతిపత్రాలు అందజేశారు.
గతంలో పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రైల్వే జంక్షన్ పరిసరాల్లోని టౌన్ స్టేషన్లో ట్రయాంగిల్ ప్లాట్ఫారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రత్వానికి ప్రతిపాదనలు చేసి సర్వేకు అనుమతి ఇప్పించారు. అదేవిధంగా ఢిల్లీ, చెన్నై మార్గాల నుంచి వచ్చే ముఖ్య రైళ్లన్నీ కాజీపేట టౌన్ స్టేషన్లో ఆగకుండా వెళ్లిపోతుండడంతో ప్రజలు వ్యయప్రయాసలకు ఓర్చి వరంగల్ రైల్వే స్టేషన్లో దిగుతున్నారు. కాజీపేటలో ట్రయాంగిల్ ప్లాట్ఫారం ఏర్పాటు చేస్తే సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆగుతాయి. జంక్షన్‌కు పూర్వ వైభవం నిలుస్తుంది. రైల్వే పాలిక్లినిక్ దవాఖానలో ప్రతి రోజు సుమా రు 500 మంది వరకు కార్మికులు, విశ్రాంత కార్మికులు, కుటుంబాలు సేవలు పొందుతారు. అరకొర వైద్యులు, సిబ్బందితోనే సేవలందుతున్నాయి. ఈ దవాఖానను అప్‌గ్రేడ్ చేసి మౌలిక వసతుల ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న రైలు మార్గాలకు రైల్వే శాఖ మంత్రి మోక్షం కల్పిస్తే చాలావరకు రింగ్ రైలు మార్గానికి నోచుకుంటుంది. మణుగూర్ నుంచి రామగుండం(పెద్దపల్లి)కి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపులు, హసన్‌పర్తి రోడ్డు-కరీంనగర్‌కు రైల్వే లైన్‌కు ప్రతిపాదనలు, స్టేషన్ ఘన్పూర్ వయా పాలకుర్తి, నల్గొండ, మిర్యాలగూడకు గతంలోనే భూ సర్వే జరిగింది. డోర్నకల్ జంక్షన్-గద్వాల వరకు ఇప్పటికే రైల్వే లైన్ నిర్మాణ పనులకు రైల్వేశాఖ శ్రీకారం చుట్టింది. రైల్వే లైన్ల పెండింగ్ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు.