హనుమకొండ, జనవరి 10 : అగ్రంపహాడ్ సమ్మక, సారలమ్మ జాతరకు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్లో జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సిక్తా పట్నాయక్‌తో కలిసి సమీక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చూడాలన్నారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, స్నానాల కోసం నీటి సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. జాతరకు మహిళలు ఎకువగా వచ్చే అవకాశం ఉంటుందని, మహిళా పోలీసు సిబ్బంది ఎకువగా విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తగినన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్టీసీ బస్సులను పెంచాలని అధికారులకు సూచించారు. జాతరలో ప్లాస్టిక్ వినియోగించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు, ప్లాస్టిక్ సంబంధించిన ఇతరత్రాలను దుకాణాదారులు విక్రయించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జాతరను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వచ్చే నెల 18వ తేదీ నాటికి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాధికాగుప్తా, మహేందర్ జీ, డీసీపీ రవీందర్, పరకాల ఆర్డీవో శ్రీనివాస్, ఏసీపీ కిశోర్ కుమార్ పాల్గొన్నారు.