వరంగల్, సెప్టెంబర్ 30 : రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. శనివారం కుడా కాన్ఫరెన్స్ హాల్లో మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి మంత్రి కేటీఆర్ పర్యటనపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్‌విప్ మాట్లాడుతూ 6న మంత్రి కేటీఆర్ నేరుగా హైదరాబాద్ నుంచి వరంగల్ కేఎంసీకి చేరుకుంటారని తెలిపారు. ఎంజీఎం సమీపంలో పోలీస్ భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అలాగే, స్మార్ట్‌సిటీ పనులు, డిజిటల్ లైబ్రరీ, ఐటీ టవర్స్, ఆరు జంక్షన్ల ప్రారంభోత్సవాలతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారని వివరించారు. వాటికి సంబంధించిన ఏర్పాట్ల పనులను అధికారులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. మంత్రి కేటీఆర్ పర్యటన రూట్ మ్యాప్‌ను అధికారులకు వివరించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జీవో 58,59,76కి సంబంధించిన మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని, దానికి సంబంధించిన ఏర్పాట్లు పక్కాగా ఉండాలని అధికారులకు తెలిపారు. కేటీఆర్ పర్యటనలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు బారీ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, డీసీపీ బారీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కుమార్, డీఈవో అబ్దుల్ హై, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.