ములుగు, మే 23 (నమస్తే తెలంగాణ) : సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ప్రహరీ నిర్మాణం కోసం జరిపిన తవ్వకాల్లో బయటపడినవి ద్వార బంధాల శిలలని పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. గత నెల 23న రాళ్ల ఆనవాళ్లు బయల్పడగా, వాటిని పరిశీలించాలని ఇటీవల వీసీ ప్రొఫెసర్ వైఎల్ శ్రీనివాస్ పురావస్తు శాఖ అధికారులకు లేఖ రాయగా, శనివారం వారు ఆయనకు నివేదిక అందించారు. లోకం చెరువు వద్ద రాళ్లను పరిశీలించామని, వాటిపై ఎలాంటి శిల్పం, చిహ్నాలు లేవని అందులో పేర్కొన్నారు. కాకతీయులు దేవాలయాలు, చెరువులు, కోటలు నిర్మించగా, వారి ఆధీనంలో ఉన్న వారు కూడా తమ గ్రామా ల్లో చిన్న ఆలయాలను నిర్మించడంలో ఇదే పద్ధతిని అనుసరించారన్నారు.
కాలక్రమేణా ఆలయాల నిర్వహణ లేకపోవడం, గుప్త నిధుల కోసం గుడులను ధ్వంసం చేయడంతో వాటి ఆనవాళ్లు లేకుండాపోయాయన్నారు. చెరువు గట్లపైన, తూముల సమీపంలో చిన్న ఆలయాలను నిర్మించి వాటిలో మైసమ్మ, పోచమ్మ పేర్లతో విగ్రహాలను ప్రతిష్ఠించడం ఆచారంగా వస్తుందన్నారు. అలాంటి చిన్న ఆలయం లోకం చెరు వు గట్టుపై ఉండొచ్చని, చెరువు దిగువన కొన్ని చెక్కని రాళ్లు తప్ప ఇటుక, కుండ పెంకు లాంటివి కనపడలేదన్నారు. విశ్వవిద్యాలయ అధికారులు పనులు చేపడుతున్న సమయంలో పురావస్తుకు సంబంధించిన ఆధారాలు ఏమైనా కనుగొంటే విషయాన్ని తమకు తెలపాలని నివేదికలో పేర్కొన్నారు.