ఎన్నికలకు ముందు అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పడేసింది. ఒకటి, రెండు హామీలను అమలు చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నది. ముఖ్యంగా ఆసరా పింఛన్లపై ఇచ్చిన మాటను నెరవేర్చక ఇబ్బందులకు గురిచేస్తున్నది. కొత్త పింఛన్లు మంజూరు చేయక.. ప్రస్తుత లబ్ధిదారులకు పెన్షన్లు పెంచి ఇవ్వక చోద్యం చూస్తున్నది. దీంతో దరఖాస్తుదారులతో పాటు పింఛన్‌దారులు సర్కారుపై మండిపడుతున్నారు. ఏడాదిన్నరగా తమను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ మాటలు నమ్మి.. అత్యాశకు పోయి ఓట్లేసినందుకు తగిన శాస్తి జరిగిందంటూ వాపోతున్నారు.
– మహబూబాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ
ఆసరా పింఛన్ల విషయమై కాంగ్రెస్ సర్కారు హ్యాండివ్వడంతో కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ప్రస్తుతం ఉన్న లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చి 17 నెలలవుతున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఒకటి, రెండు పథకాలనే అమలు చేస్తున్న ప్రభుత్వం.. ముఖ్యంగా ఆసరా పింఛన్లను పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో 2023 ఆగ స్టు వరకు 1,12,395 మందికి రూ. 1,658 కోట్ల పింఛన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసేది. ఇందులో వృద్ధులు 47,261 మంది, దివ్యాంగులు 15,734, వితంతువులు 42,453, ఒంటరి మహిళలు 3,044, గీత కార్మికులు 3,036, చేనేత కార్మికులు 400, బోదకాలు 378, డయాలసిస్ 74, బీ డీ కార్మికులు 15 మంది ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12,000 మం ది దరఖాస్తు చేసుకోగా ఒక కొత్త పింఛను కూడా ఇవ్వలేదు. ఇందులో 8,000 మంది వృద్ధులు, మూడు వేల మంది దివ్యాంగులు, మరో వేయి మంది చేనేత, గీత తదితరులున్నారు. అలాగే హనుమకొండ జిల్లాలో 1,02,520 మందికి ప్రస్తుతం ప్రతి నెలా రూ. 24,19,65,616 ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈ జిల్లాలోనూ 8,536 మంది కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకొని మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. అధికారులు దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపించినప్పటికీ పట్టించుకోవడం లేదు. అయితే ఆసరా పింఛన్లకు సంబందించిన సైట్‌ను ప్రభుత్వం మూసివేసిందని, దానిని తెరవాల్సి ఉందని సంబంధిత అధికారులు అంటున్నారు.
ఆసరా పింఛన్ పైనే ఆధారపడి బతుకుతున్న. నా కు నెలవారీ మందులతో పాటు ఇతర ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి. కేసీఆ ర్ సారు ప్రభుత్వం ఉన్నపు డు ప్రతి నెల 1వ తేదీ న పైసలు వచ్చేటియి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక ఆలస్యమవుతున్నది. ఒక్కొక్కసారి నెలలు పడుతున్నది. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు పెంచుతామని చెప్పిండ్రు. రెండేండ్లు కావస్తున్నా ఇప్పటి వరకు పెంచలేదు. అన్నీ అబద్ధాలు చెప్పి ప్రజల ను మోసం చేసిండ్రు. ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచాలని కోరుకుంటున్నా.
-ఎస్ మణెమ్మ, జితేందర్సింగ్నగర్, హనుమకొండ
అలాగే ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఇస్తున్న రూ. 2,016ను రూ. 4 వేలకు, దివ్యాంగులకు రూ. 4,016 నుంచి రూ. 6 వేలకు పెంచి అందజేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదని ఆసరా లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక ఇంట్లో చనిపోయిన వ్యక్తి స్థానంలో అతడి భార్యకు 58 ఏళ్లు నిండితే పింఛన్‌ను భర్తీ చేస్తున్నారు తప్ప కొత్త వాటిని మాత్రం మంజూరు చేయడం లేదు. దీనికి తోడు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 1వ తేదీన పింఛన్లు వచ్చేవని, ఇప్పుడు నెల చివరన పంపిణీ చేస్తున్నారని, ఈ డబ్బులపై ఆధారపడిన వారికి ఇబ్బందిగా మారుతున్నదని లబ్ధిదారులు వాపోతున్నారు.