పర్యాటక ఖిల్లాగా ప్రసిద్ధి గాంచిన ములుగు జిల్లాకు ఇంచర్ల సమీపంలో ఏర్పాటు చేస్తున్న గట్టమ్మ ఎకోపార్క్ మరో మణిహారం కానుంది. గత ప్రభుత్వ హయాంలో సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ నర్సరీ నిర్మాణంలో భాగంగా దీనికి అడుగులు పడగా, 200 ఎకరాల అటవీ భూమిని అధికార యంత్రాంగం గుర్తించింది. ఈ పనులు చేపట్టేందుకు అప్పటి సర్కారు రూ.1.50 కోట్ల ను అటవీ శాఖకు మంజూరు చేసింది.
ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 50 లక్షల కంపా నిధులు విడుదల చేసింది. ఇందులో భాగంగా 10 హెక్టార్ల విస్తీర్ణంలో 11,100 మిశ్రమ జాతి మొక్కల పెంపకాన్ని చేపట్టింది. అదేవిధంగా అటవీ జాతుల గురించి తెలియజేసేందుకు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంది. 80 శాతం పనులు పూర్తి కాగా, ఆగస్టు 15 వరకు పార్క్‌ను ప్రారంభించేందుకు ఫారెస్టు శాఖ సిద్ధమైంది.
– ములుగు, జూలై 19 (నమస్తేతెలంగాణ)
ఆదిదేవత గట్టమ్మ పేరు మీద ములుగు మండలం ఇంచర్ల సమీపంలోని ఎర్రి గట్టమ్మ వద్ద గట్టమ్మ ఎకో పార్క్‌ను అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 6 సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నర్సరీలను జోన్ల వారీగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూ పొందించింది. ఇందులో భాగంగా ములుగు జిల్లాలో సైతం మె గా నర్సరీని ఏర్పాటు చేసి కాళేశ్వరం జోన్‌లోని 6 జిల్లాలకు మొక్క లు సరఫరా చేసేందుకు నర్సరీ నిర్మాణానికి అధికారులు 2022 అక్టోబర్‌లో పనులు ప్రారంభించారు.
ఎర్రగట్టమ్మ దేవాలయం సమీపంలో ఉన్న కంపార్టుమెంట్ 544కు చెందిన 200 ఎకరాల అటవీ భూమిని అధికారులు గుర్తించి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పనులు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం రూ. కోటీ 50 లక్షల నిధులను అటవీ శాఖకు మంజూరు చేయగా నిర్మాణ పనులు చేపట్టారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల వరకు పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత అధికారులు ప్రభుత్వానికి అవసరమైన నిధులకు ప్రతిపాదనలు పంపించగా 2024లో రూ. 50 లక్షల కంపా నిధులు విడుదల చేసింది. 200ఎకరాల విస్తీర్ణంలో గట్టమ్మ ఎకో పార్క్ పేరిట అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 80 శాతం పనులు పూర్తి కాగా ఆగస్టు 15వ తేదీ వరకు పార్క్‌ను ప్రారంభించేందుకు ఫారెస్టు శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
10హెక్టార్లలో మిశ్రమ జాతి మొక్కల పెంపకం
ఇంచర్ల బీట్ కంపార్టుమెంట్ నంబర్ 544లో కంపా నిధులతో 10 హెక్టార్ల విస్తీర్ణంలో మిశ్ర మ జాతి మొక్కల పెంపకం చేపట్టారు. 200ఎకరాల భూమిని చదును చేసి ప్రత్యేకంగా రోడ్లు నిర్మించి, నీటి కుంటలను తవ్వించి కాల్వల ద్వారా మొక్కలకు నీటిని అందేలా పనులు చేపట్టా రు. మొక్కల మధ్య 3X3 దూరంతో 11,100 మొక్కలను నాటి వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు. మర్రి, అల్లనేరెడు, వేరు మద్ది, వేప, నారేప, రావి, చిందూగ, ఉసిరి, కానుగ, చింత, ఇప్ప, బ్యాంబు, ఎగిస, నెమతి నార, ఆస్ట్రేలియన్ మర్రి వంటి మొక్కలతో పాటు మరి కొన్ని జాతుల మొక్కలు పెంచుతున్నారు.
భవిష్యత్ తరాలకు అటవీ జాతు ల గురించి తెలియజెప్పేందుకు, విద్యార్థుల కోసం ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్(ఈఈసీ) బిల్డింగ్‌ను సైతం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పర్యాటకులు, అటవీ ప్రేమికులు ఎకో పార్క్‌ను సందర్శించి వీక్షించేందుకు వాచ్ టవర్ నిర్మిస్తున్నారు. దీంతో వ్యూ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొక్కల సంరక్షణ కోసం నీటి కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పార్క్ ఆర్చిని అటవీ శాఖ ప్రాముఖ్యతను తెలిపేవిధంగా నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే ములుగు జిల్లాలో రామప్ప, లక్నవరం, బొగత, మేడారం, మల్లూరు వంటి పర్యాటక ప్రాంతాలు ఉండగా నిత్యం వీటిని దేశ విదేశాల పర్యాటకులు సందర్శిస్తున్నారు. ప్రస్తుతం గట్టమ్మ ఎకో పార్క్ పూర్తయి అందుబాటులోకి వస్తే మరో పర్యాటక ప్రాంతంగా ములుగు జిల్లాకు పేరు తేవడంతో పాటు అటవీ శాఖకు ఆదాయ వనరుగా మారనున్నది.
ఆగస్టు 15 వరకు ప్రారంభిస్తాం
గట్టమ్మ ఎకో పార్క్ పనులు డీఎఫ్‌వో పర్యవేక్షణలో చేపడుతున్నాం. ఆగస్టు 15వ తేదీ వరకు 100 శాతం పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. భవిష్యత్ తరాలకు అటవీ శాఖ ప్రాధా న్యతను తెలిపేందుకు ఎన్విరాన్ మెంటల్ ఎడ్యుకేషన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయను న్నాం. ఫెన్సింగ్ పనులు పూర్తయ్యాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ చేపడుతాం. పార్క్ ను సందర్శించేందుకు ప్రవేశ రుసుమును ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు ప్రకటించనున్నాం.
– డోలి శంకర్, ములుగు ఫారెస్టు రేంజ్ ఆఫీసర్