హనుమకొండ, జూన్ 4 : ట్రాన్స్‌కో వరంగల్ జోన్ కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన సదరు అధికారి ఇక్కడి ఉద్యోగులపై వివక్ష చూపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడనే విమర్శలు వ్యక్తమతున్నాయి. తమ సమస్యలను చెప్పుకొనేందుకు వెళ్లే పరిస్థితి లేదని, ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాకుండా ఉందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇంజినీర్లు, ఆర్టిజన్లు, ఓఅండ్ఎం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టానుసారంగా బదిలీలు చేస్తున్నాడని పలువురు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్‌కో వరంగల్ జోన్ పరిధిలో వరంగల్, ఖమ్మం సర్కిళ్లుండగా ఇటీవల కొత్తగా జనగామ సర్కిల్ ఏర్పాటైందని, దీని విభజన శాస్త్రీయంగా జరగలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఒక సర్కిల్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న సబ్‌స్టేషన్ మరొకదాని పరిధిలో చూపిస్తున్నారంటున్నారు. అనేక సబ్స్టేషన్లది ఇదే పరిస్థితి అని, దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. అలాగే ఉద్యోగుల బదిలీలు, ఇతరత్రా సంస్థకు సంబంధించిన విషయాల్లో కిందిస్థాయి ఉన్నతాధికారులు, యూనియన్లు, సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. తమ సమస్యలను ఏ స్థాయి అధికారికి కూడా చెప్పుకునేందుకు అనుమతివ్వడం లేదని మండిపడుతున్నారు.
ఏజెన్సీ ప్రాంతంలో పనిచేసే వారికి అలవెన్స్ వస్తుందని, ప్రస్తుతం అది ఆర్టిజన్లకు రావడం లేదని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టిజన్లు చేసిన సమ్మె కాలనికి వేతనం ఇవ్వాలని ట్రాన్స్‌కో సీఎండీ ఆదేశించినప్పటికీ ఇంకా కొందరికి రాలేదని వాపోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆర్టిజన్లు పనిచేసే స్థానంలో సబ్ ఇంజినీర్లకు పోస్టింగ్ ఇస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అంతేకాక డిప్లొమా, ఐటీఐ అర్హతలున్న వారు సబ్ స్టేషన్లలో విధులు నిర్వర్తించాల్సి ఉన్నప్పటికీ ఆఫీస్‌లో పోస్టింగ్ ఇస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మార్చిలో అనుమతి లేకుండా ఆఫీసులో అడుగు పెట్టొద్దని జారీ చేసిన సర్క్యులర్‌పై తాము ఆగ్రహం వ్యక్తంచేసిన ఘటనను ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. అయినప్పటికీ సదరు అధికారి తన వింత పోకడలు మానుకోవడం లేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌కో ఇంజినీర్లు, ఆర్టిజన్లు, ఓ అండ్ ఎం, తదితర ఉద్యోగులు జేఏసీగా ఏర్పాటై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ట్రాన్స్‌కో వరంగల్ జోన్ సీఈ శ్రీరాంకుమార్ వింత పోకడలకు నిరసనగా ములుగు రోడ్డులోని కార్యాలయం ఎదుట ఆర్టిజన్లు, ఓ అండ్ ఎం ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (టీఆర్వీకేఎస్) ట్రాన్స్‌కో వరింగ్ ప్రెసిడెంట్ కందికొండ వెంకటేశ్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు తమకు అనుకూలంగా ఉన్న వారిని హెచ్ఆర్ఏ పోస్టుల్లోకి బదిలీ చేస్తూ అక్కడ ఉన్న ఆర్టిజన్లను సుదూర ప్రాంతాలకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మెడికల్ ఇబ్బందులున్న ఉద్యోగులకు మాత్రమే వారి విజ్ఞప్తి మేరకు బదిలీ అవకాశాలను పరిశీలించాలనే సీఎండీ ఆదేశాలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఇటీవల ఏర్పాటైన జనగామ సర్కిల్‌ను శాస్త్రీయంగా విభజించలేదని, దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో మరో ఉద్యమం చేస్తామని వెంకటేశ్ హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు ఐలయ్య, రాజన్న, ఆనంద్, జనార్దన్, రాజేశ్, శ్రీకాంత్, శేఖర్, శ్రీలక్ష్మి, ఇందిర, బాలాజీ, రవి, రజినీకాంత్, రాజేందర్, రమేశ్, ప్రభాకర్, గోవింద్, రఘు, చంద్రమౌళి, శ్రీనివాస్, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌కో ఉద్యోగులు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదు. అవి నా పరిధిలోని అంశాలు కావు. ఆయా సర్కిళ్ల ఎస్ఈ, డీఈలు చూసుకోవాల్సింది. ఏదైనా సమస్య ఉంటే వారినే అడగాలి. బదిలీల విషయంలో నా ప్రమేయం లేదు. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సర్కిళ్ల విభజన జరిగింది. ఉద్యోగుల సమస్యలను ఆయా సర్కిళ్ల ఎస్ఈలతో చర్చించుకోవాల్సింది.
– శ్రీరాంకుమార్, సీఈ, ట్రాన్స్‌కో వరంగల్ జోన్