ఖిలా వరంగల్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి వంగూరి ఆనందరావు అన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్ పి ఆధ్వర్యంలో వరంగల్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడి అనాగరికమైందన్నారు.
ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేసిందన్నారు. దళితుడైన బిఆర్ గవాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీవించుకోలేక పోతున్నాయని విమర్శించారు. ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయవ్యవస్థలో పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కట్ల రాజశేఖర్ మాదిగ, నాయకులు కళ్లేపెళ్లి ప్రణయ్ దీప్, చింతం సిద్దు, రవి, ఇనుముల పూర్ణయ్య, మల్లేష్, వశపాక కుమార్, దామెర కిషోర్ తదితరులు పాల్గొన్నారు.