నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 27 : ఉమ్మడి వరంగల్ జిల్లా లో కొత్త మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. ఆయా జిల్లా ల్లో సోమవారం లక్కీ డ్రా పద్ధతిలో లైసెన్స్‌దారుల ఎంపిక పూర్తయ్యింది. ఉమ్మడి జిల్లా లో మొత్తం 294 మద్యం దుకాణాలుండగా 10,493 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 292 షాపులకు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లు డ్రా తీశారు. ములుగు జిల్లాలోని చల్వాయి (49), గోవిందరావుపేట (50) దుకాణాలకు మూ డు చొప్పున దరఖాస్తులు రావడంతో ప్రొహిబిషన్, ఎక్సైజ్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు వాటికి డ్రా తీయలేదు. మద్యం షాపుల కేటాయింపునకు దరఖాస్తుదారులు, వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రు లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లిలో ఆయా కలెక్టర్లు స్నేహా శబరీష్, షేక్ రిజ్వాన్ బాషా, అద్వైత్‌కుమార్ సింగ్, రాహుల్ శర్మ డ్రా తీయగా, వరంగల్‌లో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి లైసెన్స్‌దారులను ఎంపిక చేశారు. అయితే హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో ఉదయం 11 గంటలకు డ్రా కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా, 12 గంటలైనా మొదలు పెట్టకపోవడంతో దరఖాస్తుదారులు ఎక్సైజ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గ్రీవెన్స్ సెల్లో పాల్గొన్న కలెక్టర్ స్నే హా శబరీష్ గంటన్నర ఆలస్యంగా రావడంతో డ్రాను మొదలుపెట్టారు. కాగా, లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న దరఖాస్తుదారులు సంబురాలు చేసుకోగా, మిగిలిన వారు నిరాశతో వెనుదిరిగారు.
వరంగల్, జనగామ జిల్లాల్లో భార్యా భర్తలు, మహబూబాబాద్ జిల్లాలో తండ్రీ కొడుకులను అదృష్టం వరించింది. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గంప రాజేశ్వర్‌గౌడ్, సాంబలక్ష్మి దంపతులకు నర్సంపేట (5), గూడెప్పాడ్ (38), జనగామ పట్టణానికి చెందిన మారబోయిన సంతోష్, సరిత దంపతులకు దేవరుప్పుల (50), తరిగొప్పుల (32) షాపులు దక్కాయి. అలాగే మహబూబాబాద్‌కు చెందిన తండ్రి గొట్ల వెంకటేశ్వర్లు, కొడుకు గొట్ల రాకేశ్‌కు మానుకోట (12), మరిపెడ (31) షాపులు దక్కాయి.