హనుమకొండ చౌరస్తా : రాష్ట్ర బడ్జెట్ ( State Budget ) లో విద్యారంగానికి ( Education Sector ) కేవలం 8.22 శాతం మాత్రమే నిధులు కేటాయించడాన్ని టీపీటీఎఫ్( TPTF ) నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం విద్యారంగంపై చిన్నచూపును నిరసిస్తూ ఈనెల 24న జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి ( Tirupati ), కార్యదర్శి రావుల రమేష్ ( Ramesh ) తెలిపారు.
ఆదివారం హనుమకొండలోని టీపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బత్తిని శ్రీరామాంజనేయులు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వారు ముఖ్యఅథితులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 3,24,234 కోట్ల బడ్జెట్లో విద్యారంగానికి 26,674 కోట్లు మాత్రమే కేటాయించి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు.
పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, డీఏలు, సీపీఎస్ రద్దు తదితర టీచర్ల సమస్యలపై బడ్జెట్లో కనీస ప్రస్తావన కూడా లేకపోవడాన్ని తప్పుబట్టారు. విద్యారంగానికి బడ్జెట్లో 20శాతం నిధులు కేటాయించాలని, పీఆర్సీని వెంటనే ప్రకటించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గొడిశాల సత్యనారాయణ, భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జగపతిరావు, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రగిరి లక్ష్మయ్య, చందుపట్ల రాజేంద్రం, జిల్లా కార్యదర్శులు అన్నారెడ్డి, వీరభద్రం, అంకం శ్రీనివాస్ పాల్గొన్నారు.