వరంగల్‌చౌరస్తా, ఆగస్టు 1 : ఉత్తర తెలంగాణ ప్రజలకు ప్రభుత్వ ఉచిత వైద్యసేవలు అందిస్తున్న ఎంజీఎం దవాఖాన లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు అమ్మకానికి పెట్టారు. రోగులకు వైద్యసేవలతో పాటు భద్రత కోసం సెక్యూరిటీ, పారిశుధ్య నిర్వహణ కోసం శానిటేషన్, రోగులను వార్డులకు మార్చడానికి, అవసరమైన పరీక్షలు చేయించడానికి పేషెంట్ కేర్ సిబ్బందిని ఔట్సోర్సింగ్ విధానం ద్వారా నియమిస్తున్నారు. ప్రభుత్వం నుంచి టెండర్ ప్రక్రి య ద్వారా కాంట్రాక్టు దక్కించుకున్న సం స్థ ప్రభుత్వ నిబంధనలకు లోబడి నియామకాలు చేపట్టాలి. కాగా, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన కొందరు వ్యక్తుల అమాకయత్వాన్ని ఆసరాగా చేసుకొని కాంట్రాక్టు సంస్థ తరఫున ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగి తన చేతివాటా న్ని ప్రదర్శిస్తున్నాడు.
నిరుద్యోగుల నుంచి లక్షలు దండుకుంటున్నట్లు పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్ర భుత్వ నిబంధనలు పాటిస్తున్నామని చెప్తున్న కాంట్రాక్టు సంస్థ తమ ఉద్యోగి మోసాలకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల కొందరు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి సీనియార్టీ నిబంధనలను పాటించకుండానే విధులు కేటాయించడాన్ని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అంగీకరించకుండా విధులు బహిష్కరించి, ధర్నాకు దిగారు. ఈ విషయంపై కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని ఎంజీఎంహెచ్ వైద్యాధికారులు హామీ ఇవ్వడంతో సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్టు సంస్థ ప్రతినిధిని ఫోన్లో సంప్రదించడానికి నమస్తే తెలంగాణ ప్రయత్నించగా స్పందించలేదు.
ఇక ఎంజీఎంహెచ్‌లో వార్డులు, విభాగాలకు అవసరమైన సెక్యూరిటీ సిబ్బంది ఉన్నా ఇటీవల పలువురిని మళ్లీ అదే విభాగంలో నియమించారు. అవసరమైన శానిటేషన్ సిబ్బంది నియామకాలు పక్కనపెట్టి, అవసరానికి మించి సెక్యూరిటీ సిబ్బందిని నియమించడంపై శానిటేషన్ విభాగం సిబ్బంది జూలై 28వ తేదీన ఆందోళన చేపట్టారు. ఒక షిఫ్ట్‌లో ఒక శానిటేషన్ కార్మికుడు రెండు అంతకు మించి వార్డుల శానిటేషన్ విధులు నిర్వర్తించాల్సి వస్తున్నా, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా, నియామకాలు చేపట్టకుండా సెక్యూరిటీ విధుల కోసం నియామకాలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైద్యాధికారులు దృష్టి సారించి అవసరాలకు తగిన విధంగా సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్‌కేర్ సిబ్బందిని నియమించాలని కార్మికులు కోరుతున్నారు.