‘ఓం నమః శివాయ’, ‘హరహర మహాదేవ శంభోశంకర..’ ఇలా ముక్కంటి నామస్మరణతో శనివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ మార్మోగాయి. మహాశివరాత్రి అందునా శనిత్రయోదశి కలిసిరావడంతో వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. వరంగల్లోని కాశీ విశ్వేశ్వరాలయం, స్వయంభు శంభులింగేశ్వరాలయం, స్టేషన్రోడ్డులోని ఆకారపు గుడి, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మడికొండలోని మెట్టు రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు బారులు తీరి స్వామిని దర్శించుకున్నారు. సంగెంలోని సంగమేశ్వర స్వామికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు పట్టు వస్ర్తాలు సమర్పించారు. సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణంలోని వేదికపై మేళతాళాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించగా భక్తులు కనులారా వీక్షించారు. అర్ధరాత్రి లింగోద్భవ కాలం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు అభిషేకాలు కొనసాగాయి. రాత్రంగా భక్తులు జాగరణ చేస్తూ.. పరమ శివుడికి ప్రత్యేక పూజలు చేశారు.
ఓంకార నాదంతో ఆలయాలన్నీ మార్మోగాయి. శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు కనులపండువగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి అర్చనలు, అభిషేకాలతో స్వామి వారికి పూజలు చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో శైవక్షేత్రాలన్నీ కిటకిటలాడాయి. అలాగే సాయంత్ర వేళ భక్తుల జయజయ ధ్వానాల మధ్య శివపార్వతుల కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. హనుమకొండ వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర-రుద్రేశ్వరీదేవి కల్యాణం కమనీయంగా సాగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. కాళేశ్వరంలోని కాళేశ్వర, ముక్తీశ్వర ఆలయంలో శివపార్వతుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్త జనులతో త్రివేణి సంగమం(గోదావరి నది) పులకించింది. గణపురంలోని గణపేశ్వరాలయం కోటగుళ్లలో శ్రీ భవా నీ సమేత గణపేశ్వర స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. పాలకుర్తి సోమేశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులు తీరడంతో క్షేత్రం కిక్కిరిసిపో యింది. కురవి వీరభద్ర స్వామి ఆలయంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ వీరభద్రుడు, భద్రకాళీల పెళ్లి వేడుకగా సాగింది. రామప్పలోని రామలింగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని పరవశించారు. మడికొండ మెట్టుగుట్టపై స్వయంభూ లింగేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి మహానీరాజనం జరిపించారు. అలాగే పలు ఆలయాల్లో తెల్లవార్లు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్