నమస్తే తెలంగాణ, నెట్వర్క్, అక్టోబర్ 19: బీఆర్ఎస్ పార్టీకి ఊరూరా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గులాబీ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇతర పార్టీల వారిని గులాబీ గూటికి చేర్చుకుంటూ.. మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులు తమదైన శైలిలో దూసుకెళ్తున్నారు. మరోసారి తమను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. పెద్దవంగర మండల కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్‌రావు ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
అదేవిధంగా ఉప్పరగూడెం, వడ్డేకొత్తపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ చేరడంతో వారికి పార్టీ కండువాలు కప్పారు. కాజీపేటలో చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ ప్రచారం చేశారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన సమక్షంలో 500 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు పార్టీలో చేరారు. తరిగొప్పుల మండలంలోని సోలిపురం పోచమ్మ తల్లిని దర్శించుకొని, అక్కడి నుంచి సోలిపురం, పోతారం, అక్కరాజుపల్లి, మర్యాపురం, అబ్దుల్‌నాగారం గ్రామాల్లో జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీఆర్ఎస్లో చేరగా, వారిని పార్టీలోకి ఆహ్వానించా రు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్‌నాయక్ 36 వార్డులకు బూత్ కమిటీలను నియమించి, వారికి దిశానిర్దేశం చేశారు.
మెకానిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మండ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు సుమారు 100 మంది బీఆర్ఎస్లో చేరగా, వారిని స్వాగతించారు. నర్సంపేటలోని పార్టీ క్లస్టర్ బాధ్యులు, ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. 12, 23 వార్డుల్లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన 58 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరగా వారిని ఆహ్వానించారు. గీసుగొండ మండలం నందనాయక్‌తండాకు చెందిన కాంగ్రెస్ యూత్, యువజన సంఘాల నాయకులు గులాబీ గూటికి చేరగా, పరకాల ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి పార్టీ కండువాలను కప్పి స్వాగతించారు.
ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన వివిధ పార్టీల యువ నాయకులు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మామునూరులో 43వ డివిజన్ కార్యకర్తలు, నాయకులతో వర్ధన్నపేట ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ మమేకమై, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ వివరించాలని సూచించారు. గణపురం మండలం చెల్పూర్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలతో సమావేశమై, అనంతరం వివిధ గ్రామా ల్లో ప్రచారం చేశారు. వెంకటా పూర్లో ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.