స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 15 : భార్య తాళిబొట్లు అమ్ముకుని ఆటో కొనుక్కొని జీవితాన్ని నెట్టుకొస్తున్నామని, మహిళలకు బస్సుల్లో ఫ్రీ టికెట్ కల్పించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, సీఎం రేవంత్ రెడ్డి దారి చూపాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్టేషన్ ఘన్పూర్, జఫర్గఢ్, చిల్పూర్ మండలాల ఆటోడ్రైవర్లు గాంధీ చౌరస్తా నుంచి జాతీయ రహదారి బస్టాండు వరకు ర్యాలీ తీసి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. వద్దురా నాయనా కాంగ్రెస్ పాలన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తీసి వేయాలని లేదా ఆటోడ్రైవర్లకు ఉపాధి కల్పించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు ప్రజలను ఆదుకునేలా ఉండాలి కాని, ప్రజల పొట్ట కొట్టేలా ఉండొద్దన్నారు. ప్రజల చావుకు కారణమయ్యేలా నడుచుకునే ప్రభుత్వాలను ఎవరూ ఆదరించరన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రోజుకు రూ.500 నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించే వాళ్లమని..
ఫైనాన్స్, ఆటో టాక్స్, బండి రిపేర్లకు పోగా మిగిలిన డబ్బుతో కుటుంబం గడిచేదని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో రోజుకు రూ.200 కూడా రావడం లేదని, ప్రభుత్వ ఉపాధ్యాయులు నెలవారీగా డబ్బులు చెల్లిస్తూ ఆటోల్లో ప్రయాణించేవారని, ఇప్పుడు వారు కూడా బస్సుల బాట పట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆదాయం తగ్గిందని, ఇప్పుడు కుటుంబాలను ఎలా పోషించుకోవాలో అర్థం గాని పరిస్థితుల్లో ఉన్నామని పేర్కొన్నారు. ఒక్క శివునిపల్లి గ్రామంలోనే రెండు వందల ఆటోలు ఉన్నాయని, పరువు పోయి ప్రాణాలను తీసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆటో యూనియన్ స్టేషన్ ఘన్పూర్ పట్టణాధ్యక్షుడు రాజారపు జయపాల్, అశోక్, యాదగిరి, కిషన్, రాజేశ్వర్రెడ్డి, వేణు, పాలకొండ మోహన్, అన్వర్, సమ్మయ్య, చేపూరి కుమార్ పాల్గొన్నారు.