ప్రతికూల వాతావరణం రైతును పరేషాన్ చేస్తున్నది. అధిక వర్షాలతో తెల్లబంగారం నల్లబడిపోతున్నది. ఇప్పటికే యూరియా సకాలంలో అందక.. అకాల వానలు కురిసి పత్తి పంట దిగుబడి తగ్గిపోగా.. ప్రస్తుతం మొంథా తుపాన్‌తో మరో ముప్పు ముంచుకొచ్చింది. ఒకవైపు పత్తి ఏరేందుకు కూలీలు దొరకక.. మరోవైపు పంటను అమ్ముకునేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాక.. ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి దాపురించింది. దీనికి తోడు పత్తి విక్రయానికి కపాస్ యాప్‌తో కొత్త కష్టాలు తోడయ్యాయి. పైగా తేమ శాతం ఎక్కువుందంటూ తక్కువ ధర పెడుతుండడం అన్నదాతను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నది. మొత్తంగా అష్టకష్టాలకోర్చి పంట పండించిన రైతులు అన్ని విధాలా నష్టపోయే దుస్థితి నెలకొంది.
– జయశంకర్ భూపాలపల్లి. అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ)
రాష్ట్రంలో మొంథా తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉం టుందని ఐదు జిల్లాలను వాతావరణశాఖ అలర్ట్ చేయగా అందులో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా లుండడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నాడు. జిల్లాలో ఐదు సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చే యాల్సి ఉండగా ప్రస్తుతం ఒక కేంద్రాన్ని మాత్రమే ఏర్పా టు చేశారు. అందులోనూ తేమ శాతం 8 ఉంటేనే మద్ద తు ధర లభిస్తుండడం.. సీసీఐ కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుంటేనే పత్తిని కొనుగోలు చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
భూపాలపల్లి జిల్లాలో 98,260 ఎకరా ల్లో పత్తి సాగవగా 11,17,912 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా సీసీఐ అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పా టు చేయడంలో జాప్యం చేస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం చిట్యాలలోని ఆంజనేయ అగ్రో కాటన్ మిల్లో సీసీఐ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భూపాలపల్లిలో ఒకటి, చిట్యాలలో మరొకటి, కాటారంలో రెండు కేంద్రాలు ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే సీసీఐ కేంద్రాల్లో తేమ శాతం 8 ఉంటేనే మద్దతు ధర రూ. 8,110, 9 శాతం ఉంటే రూ. 8,028, 10 శాతం ఉంటే రూ. 7,947, 11 శాతం ఉంటే రూ. 7,866, 12 శాతం ఉంటే రూ. 7,785 చెల్లిస్తున్నారు.
కపాస్తో కష్టాలు
కేంద్రం తీసుకొచ్చిన కపాస్ కిసాన్ యాప్‌తో రైతులు కష్టాలు పడుతున్నారు. చాలా మందికి దీనిపై అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యులు కావడం, ఆండ్రాయిడ్ ఫోన్లు లేకపోవడంతో రైతులు పత్తిని విక్రయించలేకపోతున్నారు. ఇదిలా ఉండగా కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉండడంతో రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో రైతులు పత్తిని ఎక్కువ రోజులు ఇంట్లో నిల్వ చేసుకోలేక క్వింటాకు రూ. 6 నుంచి రూ. 7 వేలకు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటూ ఆర్థికంగా నష్టపోతున్నారు.
తేమ శాతాన్ని సడలించాలి
వర్షాలతో పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు తేమ శాతం సడలించి ఆదుకోవాలి. ఇందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. అలాగే కపాస్ యాప్‌ను తొలగించి గతంలో మాదిరిగా పత్తి కొనుగోలు చేయాలి. పత్తి మద్దతు ధర రూ. 10,075 ప్రకటించాలి. క్వింటాకు రూ.475 బోనస్ చెల్లించాలి. పత్తి దిగుమతిపై ఉన్న 11 శాతం సుంకాన్ని కొనసాగించాలి.
– చింతల రజినీకాంత్. రాష్ట్ర కోకన్వీనర్. తెలంగాణ పత్తి రైతు సమాఖ్య