హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 1: హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్కాలేజీ పౌర సంబంధాల అధికారిగా (పిఆర్ఓ) జర్నలిజం విభాగానికి చెందిన అధ్యాపకుడు డాక్టర్ రక్కిరెడ్డి ఆదిరెడ్డిని తిరిగి నియమిస్తూ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి సోమవారం ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ ఆదిరెడ్డి 2002 నుంచి రెండు దఫాలుగా 23 సంవత్సరాలు పౌర సంబంధాల అధికారిగా కాలేజీ ప్రతిష్టను విశ్వవిద్యాలయ పరిధిలోనూ, సామాజిక వర్గాల్లోనూ సమర్థంగా విస్తరించారని, విద్యారంగ పురోగతిని, విద్యార్థుల సాధనలను, విభాగాల కార్యాచరణను ప్రజలకు చేరవేయడంలో ఆయన పాత్ర అపారమన్నారు.
కాలేజీ అభివృద్ధిదిశలో ఆయన అనుభవం ఎంతో మేలు చేస్తుందన్న నమ్మకంతో మరోసారి పిఆర్ఓ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డిని వైస్ ప్రిన్సిపల్ రెహమాన్, జితేందర్, హరికుమార్, అధ్యాపకులు అభినందించారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ కాలేజీ విద్యా-సాంస్కృతిక పురోగతిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పిఆర్ఓగా బాధ్యతాయుతంగా పనిచేస్తానని, అకాడమిక్, పరిశోధనా, విద్యార్థి అభివృద్ధి కార్యక్రమాలను సమాజానికి చేరవేయడంలో పారదర్శకతను కొనసాగిస్తానన్నారు.