సుబేదారి, ఆగస్టు 14 : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగంలో అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్న నల్లమల రవి కేంద్ర ప్రభుత్వం అందించే ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా ఏనుగొండకు చెందిన రవి 1991లో పోలీసు శాఖలో చేరి ఉమ్మడి మెదక్ జిల్లా శివంపేట, తూప్రాన్, మునిపల్లె పోలీసు స్టేషన్లలో ఎస్సైగా విధులు నిర్వర్తించారు.
ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొంది అమ్రాబాద్, మిర్యాలగూడ, సదాశివపేటలో పనిచేశారు. డీఎస్పీగా సంగారెడ్డి, జహీరాబాద్, అడిషనల్ డీసీపీ హోదాలో కరీంనగర్ పోలీసు శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి ప్రస్తుతం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిపాలన విభాగంలో పనిచేస్తున్నారు.
ఫైర్‌మెన్ నగేశ్‌కు విశిష్ట సేవా పతకం
ములుగురూరల్ : ములుగు ఫైర్ స్టేషన్లో లీడింగ్ ఫైర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్న తాళ్ల నగేశ్ జాతీయ స్థాయి విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. అగ్నిమాపక శాఖలో రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు అధికారులకు సేవా పతకాలు లభించగా అందులో నగేశ్‌కు చోటు దక్కింది. ఈ మేరకు ఫైర్ ఆఫీసర్ కుమారస్వామితో పాటు సిబ్బంది నగేశ్‌ను అభినందించారు.