దుగ్గొండి, ఏప్రిల్, 14 : జీవితంపై విరక్తితో ఓ యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండలంలోని వెంకటపురం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్ఐ నీలోజు వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇంగోలి వేణు (30) బీటెక్ చదివి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేవాడు. ఇటీవల నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చాడని, పట్టణంలో చేసే ప్రవేట్ జాబ్‌లో జీతం తక్కువ వస్తుందని తల్లిదండ్రులకు చెబుతూ బాధపడుతూ ఉండేవాడన్నారు.
సోమవారం ఉదయం 9 గంటల సమయంలో తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని విగత జీవిగా ఉన్న యువకుడిని చుట్టుపక్కల వారు గమనించి వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇంగోలి రాజేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వేణు మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.