సుబేదారి/ఖిలా వరంగల్, మార్చి 27 : రెప్పపాటులో ఓ హోంగార్డు యువకుడి ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలోని హంటర్‌రోడ్డు రైల్వే ట్రాక్‌పై బుధవారం సాయంత్రం జరిగింది. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు గుర్తు తెలియని యువకుడు రైలు పట్టాలపైకి వెళ్లాడు. అంతలోనే విజయవాడ నుంచి సికింద్రాబాద్ వైపు గూడ్స్ రైలు వేగంగా వస్తోంది. ఆ సమయంలో అండర్ బ్రిడ్జి కింద డ్యూటీలో ఉన్న హోంగార్డు రవికి స్థానికులు విషయం చెప్పడంతో, వెంటనే అతడు పరుగెత్తాడు. రైలు యువకుడి దగ్గరికి చేరుకునే లోపే ఒక్క ఉదుటున వెళ్లి పక్కకు లాక్కొచ్చాడు.
ఏ మాత్రం పొరపాటు జరిగినా ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం ఉండేది. బాధిత యువకుడు హితోవ సోనుది ఉత్తరాఖండ్ కాగా, బతుకుదెరువు కోసం వరంగల్‌లో పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబకలహాలతో ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలుసుకొని అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రాణాలకు తెగించి యువకుడిని కాపాడిన హోంగార్డు రవి సాహసాన్ని స్థానికులు మెచ్చుకోగా, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్పెక్టర్ శ్రీధర్ సత్కరించి అభినందించారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.