పెళ్లి వేడుక కొత్త పుంతలు తొక్కుతోంది. కాలానుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకంటూ చేరి సినిమా హంగులు అద్దుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో మొదలై, మొన్నటిదాకా ఉన్న మూడు గంటల వీడియోలకు ‘తెర’దించి.. తక్కువ నిడివిలోనే సినిమాటిక్ ైస్టెల్ గ్రాఫిక్స్‌తో కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. స్క్రీన్‌పై సినిమా టైటిల్స్‌ను మరపించేలా విజువల్ ఎఫెక్ట్స్‌తో వధూవరుల పేర్లు వేయడం సహా వారి ఫొటోలను అద్భుతంగా చూపించడం, బ్యాక్‌గ్రౌండ్ థీమ్ మ్యూజిక్.. సందర్భోచిత పాటలు, బంధుగణం సందడి, పెళ్లి సన్నివేశాల సమాహారాన్ని హైఎండ్ కెమెరాలో రికార్ట్ చేస్తూ వావ్.. సూపర్ అనిపించేలా చిత్రీకరిస్తున్నారు ఫొటో, వీడియోగ్రాఫర్లు. ఇలా కొత్తదనం కోరుకునే వారు ఖర్చుకు వెనకాడకుండా వెడ్డింగ్ షూట్స్ చేయించకుంటుండడంతో పెళ్లి వేడుక సినిమా రీల్‌ను తలపిస్తోంది.
– హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 24
హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 24 : కాలానుగుణంగా నూతన వధూవరులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. దీంతో పెళ్లి వేడుకను నయా ట్రెండ్‌లో నడిపిస్తున్నారు. వీడియో తీయడంతోనే సరిపెట్టకుండా స్టేటస్‌కు తగ్గట్టు, బడ్జెట్‌కు వెనుకాడకుండా వివాహ వైభవాన్ని వీడియో సీడీలను తయారు చేయిస్తున్నారు. సినిమాకు తీసిపోని విధంగా ఫొటో, వీడియోగ్రాఫర్లు విజువల్ గ్రాఫిక్స్‌తో అద్భుతంగా షూట్ చేస్తుండడంతో పెళ్లి ఘట్టం కొంగొత్తగా కనిపిస్తోంది.
ఫొటోలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. పెళ్లి ఫొటోలను హైటెక్నాలజీతో ప్రింట్ చేస్తున్నారు. తొలుత హైదరాబాద్‌లో ఫొటోలు పెద్ద సైజులో కడిగే మిషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో ఇంకా మంచి పెద్ద సైజు ఫొటోలు గ్రాఫిక్స్‌తో ఆల్బమ్‌లుగా తయారు చేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడి ఫొటోగ్రాఫర్లు ఇంటర్నెట్లో ఫొటోలను పంపిస్తే అక్కడ ఫొటో ఆల్బమ్‌ను తయారు చేసిన తర్వాత కొరియర్ ద్వారా పంపేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది.. అన్నీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో కొత్త డిజైన్లతో మురిసిపోవడం వారి వంతవుతోంది.
ఒకప్పుడు పెద్ద వీడియో క్యాసెట్లు ఉండేవి.. వరపూజ మొదలు పెళ్లి, రిసెప్షన్ వరకు వీడియో తీసేవారు. మూడు గంటల పెళ్లి వేడుకను చూడడం ఇబ్బందిగా మారేది. రానురాను ఆ పెద్ద క్యాసెట్ల స్థానంలో చిన్న క్యాసెట్లు వచ్చాయి. ప్రస్తుతం అవి కూడా తెరమరుగయ్యాయి. క్యాసెట్లు కొంత కాలం తర్వాత పనికిరాకుండా పోయాయి. పైగా ఇప్పుడు వీడియో క్యాసెట్లు వచ్చాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక పెళ్లిని తక్కువ నిడివిలోనే అత్యంత ఆసక్తిగా అద్భుతంగా మల్చడం ఎలా? అన్న ప్రశ్న నుంచి ఉద్భవించినవే ఈ సినిమాటిక్ వెడ్డింగ్స్. వీటిలో పెళ్లిచూపుల దగ్గరి నుంచి వివాహ వేడుక అంతా కలిపి కేవలం 15 నుంచి 30 నిమిషాల్లోపు ముగిసిపోతుంది. చక్కని నేపథ్య సంగీతంతో, ఎడిటింగ్ స్క్రిప్ట్వర్క్తో పాటు వధూవరుల అనుభూతులను, మనోభావాలను దీనికి జతచేసి ఓ అందమైన కదిలే చిత్రంగా కనువిందు చేస్తుంది. హెచ్‌డీతో కూడిన వీడియో అండ్ కెమెరాలు వచ్చాయి. వాటికి క్యాసెట్లు ఉండవు. మెమరీకార్డు ఉంటుంది. అందులోనే వివాహ వేడుక మొత్తం రికార్డ్ అవుతుంది. మొత్తం పెళ్లితంతు ముగిసిన తర్వాత గంట నిడివికే కుదిస్తున్నారు. ప్రతి సన్నివేశాన్ని వీడియో తీసినప్పటికీ అవసరమైన మేరకు మాత్రమే మెమరీ కార్డులో కాపీ చేసుకుంటున్నారు. వాటిని పెన్‌డ్రైవ్‌లోకి డౌన్లోడ్ చేస్తున్నారు.
ఈ సినిమాటిక్ వివాహాల్లో అసలు సిసలు పాత్ర అంతా ఫొటో, వీడియోగ్రాఫర్లదే. హైఎండ్ కెమెరాలు, పక్కా స్క్రిప్ట్, సంగీత నేపథ్యంతో ప్రీ ప్రొడక్షన్, రికార్డింగ్స్.. ఇవన్నీ అచ్చు సినిమా చేసినట్టే జరుగుతాయి. ఈ తరహాలో తమ పెళ్లిని రూపొందించుకోవాలని సిద్ధమైనవారు తమ బడ్జెట్‌ను చెప్పి, అది ఓకే అయ్యాక వధూవరుల వృత్తివ్యాపకాలతో పాటు బంధుమిత్రుల సహా తమవారి వివరాలను రూపకర్తలకు అందిస్తారు. అది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన వివాహమా అనేది కూడా తెలియజేస్తారు. అన్ని వివరాలు తీసుకున్న సదరు సంస్థ ప్రతినిధులు పెళ్లి థీమ్‌కు అనుగుణంగా జరిగేలా, ముహూర్తాలతో సమన్వయం చేసుకుంటూ పెళ్లి తంతును సినిమాటిక్‌గా డిజైన్ చేస్తారు. వేడుకలో తళుక్కున మెరిసే సహజమైన సన్నివేశాలను లాఘవంగా పట్టుకోవడంపై దృష్టిసారిస్తారు. ఒక్కో వీడియోగ్రాఫర్, ఫొటోగ్రాఫర్ రూ. 2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెళ్లి ఆల్బమ్స్‌కు తీసుకుంటున్నారు.
ఒకప్పుడు ఫొటోలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. వీడియో క్యాసెట్లు, సిస్టం అందుబాటులో లేని సమయంలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలకు ఎంతో ఆదరణ ఉండేది. పెళ్లి తర్వాత నెల, రెండు నెలలకు ఫొటోలు వచ్చేవి. కానీ ప్రస్తుతం ఉదయం పెళ్లి జరిగితే మధ్యాహ్నంకల్లా ఫొటోలు వచ్చేస్తున్నాయి. డిజిటల్ సిస్టం రావడంతో వరంగల్, హనుమకొండ మహానగరంలో డిజిటల్ కలర్ ల్యాబ్‌లు వెలిశాయి.
ఒకప్పుడు పెళ్లిళ్ల సందర్భంగా సంపన్నులైతే అందరూ వివాహ వేడుకలను చూసేలా కల్యాణ మండపాల ప్రాంగణాల్లో అక్కడక్కడ టీవీలు అమర్చేవారు. ప్రస్తుతం వాటి స్థానంలో పెద్దపెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్లు వచ్చాయి. జనం ఎక్కువగా ఉండే హాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని పెళ్లిళ్లు, రిసెప్షన్లలో క్రేన్ల ద్వారా వీడియో చిత్రీకరణ జరిగాయి. ఆధిక ఖర్చుతో కూడుకున్నప్పటికీ కొంతమంది తమ స్టేటస్ కోసం వాటిని ఏర్పాటు చేస్తున్నారు.
లేటెస్ట్ వెర్షన్స్‌తో వస్తున్న లేటెస్ట్ గ్రాఫిక్స్, డిజైన్స్‌తో ఫొటోలు, వీడియోలు అద్భుతంగా తీస్తున్నారు. ఒకప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది. బ్లాక్ అండ్ వైట్ ఫొటోల నుంచి చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. పెళ్లితంతు ముగిసిన తర్వాత గంట నిడివికే కుదిస్తున్నారు. ప్రతి సన్నివేశాన్ని వీడియో తీసినా అవసరమైన మేరకు చాలా బాగా చేసి ఇస్తున్నారు.
– తారక్, హనుమకొండ
సినిమా తరహాలో ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. ప్రత్యేకంగా చక్కని నేపథ్య సంగీతంతో, ఎడిటింగ్ స్క్రిప్ట్ వర్క్‌తో పాటు వధూవరుల అనుభూతులు, మనోభావాలను జతచేసి ఓ అందమైన కదిలే చిత్రంగా చేస్తున్నారు. అందరూ బాగుందనేలా మెప్పిస్తున్నారు. ఎప్పటికీ గుర్తిండిపోయేలా చాలా బాగా చేస్తున్నారు.
– సౌజన్య
ట్రెండ్‌కు తగ్గట్టు లేటెస్ట్ టెక్నాలజీను వాడుతూ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నాం. ఇప్పుడు అందరూ అదే కోరుకుంటున్నారు. మేము కూడా వధూవరుల అభిరుచికి అనుగుణంగా ఫొటో, వీడియోలు తీస్తున్నాం. పెళ్లి అనేది ఎప్పటికీ గుర్తుండిపోయేది కాబట్టి ఏ ఒక్క మూమెంట్ మిస్‌కాకుండా రికార్డు చేయడం వల్ల వారు కూడా ఫిదా అవుతున్నారు.
– రఘువీర్, ఫొటో, వీడియోగ్రాఫర్, కాశీబుగ్గ
సినిమాగ్రాఫిక్లకు తీసిపోని విధంగా రూపొందిస్తున్నాం. ఎదురుకోళ్లు ఎలా ఉండాలి. పెళ్లిపీటలపై ఎలాంటి ఫొటోలను తీయాలి.. అలాగే అప్పగింతల వరకు చిత్రీకరణ అంతా మా దర్శకత్వంలోనే జరుగుతుంది. ఒకప్పటికీ, ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. కేవలం అరగతంట, గంట నిడివిగల వీడియో తయారు చేస్తున్నాం.
– పాక రాజు, ఫొటో అండ్ వీడియోగ్రాఫర్, రెడ్డికాలనీ
డిజిటల్ సిస్టం వచ్చిన తర్వాత ఫొటో, వీడియోలు నైపుణ్యంతో తీసేవారికి మంచి డిమాండ్ ఉంది. పెళ్లి ఖర్చుకు వెనుకాడడం లేదు. మండపం మొదలుకొని వీడియో, ఫొటోలు చాలా బాగుండాలని చెబుతున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఆల్బమ్స్ తయారు చేయించేవారు. ఇప్పుడు హెచ్డీ టెక్నాలజీతో ఫొటోప్రింట్ మెషీన్లు వచ్చాయి. వీటి వల్ల అందరికీ ఉపాధి దొరుకుతోంది.
– ఎం మోహన్, జ్యోతి డిజిటల్ స్టూడియో, మడికొండ