హనుమకొండ చౌరస్తా, జనవరి 21 : వరంగల్ నిట్‌లో నిర్వహిస్తున్న యూత్ ఫెస్ట్‌లో విద్యార్థుల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారి ప్రతిభకు పదునుపెడుతూ ఎన్నో ఆవిష్కరణలకు బీజం వేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన పోటీల్లో ప్రతిభ చాటారు. ఉదయం జరిగిన యూత్ రన్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నిట్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన యూత్ రన్లో వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు, స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ రవికుమార్, ఇతర ప్రొఫెసర్లు, సీఐ మహేందర్‌రెడ్డితో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మినీ గేమ్ ఫెయిర్, యూత్ ఫర్ ఆర్మీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా 1(టీ)సీటీఆర్ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్‌సింగ్ రావత్ పాల్గొని మాట్లాడుతూ యువత సైన్యంలో చేరాలని సూచించారు. సైన్యానికి పోరాడటంలో సమర్థత మాత్రమే కాకుండా, అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా ఉండే యువత అవసరమని ఆయన పేర్కొన్నారు. మన భారత సైన్యం ఎస్ఎస్సీ(టెక్), టీసీజీ ఎంట్రీ, సీడీఎస్ ఎంట్రీ, ఎన్సీసీ ఎంట్రీ వంటి బహుళ రిక్రూట్మెంట్ అందించిందన్నారు. సైన్యంలోకి ప్రవేశించిన తన అద్భుతమైన ప్రయాణాన్ని, అతను ఎదుర్కొన్న ప్రతికూలతలను ఈ సందర్భంగా విద్యార్థులతో పంచుకున్నారు.
రాళ్లపై అందమైన బొమ్మలు
విద్యార్థుల పెయింటింగ్స్ అదరహో అనిపించాయి. పెయింటింగ్ బ్రష్‌లతో వారి ప్రతిభను బయటకు తీశారు. అందరినీ ఆకట్టుకునేవిధంగా బొమ్మలు గీశారు. స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలు, నాసా రాకెట్, చిన్నచిన్న రాళ్లను అందంగా కలర్స్‌తో వేసి ఆకర్షించేవిధంగా విద్యార్థులు తీర్చిదిద్దారు. రాళ్లపై ఆకర్షించే బొమ్మలు, ఫ్రూట్స్ వేసి ఆకట్టుకున్నారు. ఫొటోక్విజ్, పెయింటింగ్స్ ఔరా అనిపించేలా చేశారు. అనంతరం మధ్యాహ్నం ఇంప్రెషన్ ఆర్ట్, యూత్ క్విజ్, యూత్ పార్లమెంట్ పోటీల్లో విద్యార్థులు పాల్గొన్నారు.
సెలబ్రెటీ టాక్‌లో కలర్‌ఫొటో హీరో సుహాస్
యూత్ ఫెస్ట్‌లో భాగంగా నిర్వహించిన సెలబ్రెటీ టాక్ కార్యక్రమంలో కలర్‌ఫొటో సినిమా హీరో సుహాస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సుహాస్ ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులతో సినీ ఎంట్రీ, బాల్యం నుంచి ఇప్పటివరకు గుర్తుండిపోయే కొన్ని మధురజ్ఞాపకాలను పంచుకున్నారు. అనంతరం సరదాగా సెల్ఫీలు దిగుతూ విద్యార్థులు ఎంజాయ్ చేశారు.
అబ్బురపరిచిన స్పీకింగ్ షాడోస్..
నిట్ ఆడిటోరియంలో షాడో ఆర్టిస్ ప్రహ్లాద్ ఆచార్య ప్రదర్శన అందరినీ అలరించింది. కోతిబొమ్మతో నిర్వహించిన ప్రదర్శనలో విద్యార్థులు కడుపుబ్బ నవ్వుతూ ఎంజాయ్ చేశారు. అనంతరం ఫిల్మ్కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్లో షార్ట్‌ఫిల్మ్ మేకింగ్, ట్రైలర్ మేకింగ్‌లో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాత్రి మ్యూజిక్ క్లబ్ ఆకర్షించింది.
నేడు మెగా రక్తదాన శిబిరం
మెగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణారావు తెలిపారు. ముఖ్యఅతిథిగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొని ప్రారంభిస్తారని చెప్పారు. స్టూడెంట్ వెల్ఫేర్ డీన్ రవికుమార్ ఆధ్వర్యంలో సీపీని కలిసి ఆహ్వానించినట్లు చెప్పారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, నిట్ స్టూడెంట్స్ కౌన్సిల్ సభ్యులు బొమ్మినేని వైభవ్‌రెడ్డి, వంశీ కిశోర్, అజయ్ ఉన్నారు.