Kuravi | కురవి, నవంబర్ 19: మండల కేంద్రంలోని భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయం లో పవిత్ర కార్తీక మాస శివరాత్రిని పురస్కరించుకొని మంగళవారం స్వామివారికి లక్షబిల్వార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ వాస్తవ్యులు పొన్నాల సందీప్, వింధ్యారాణి, కొంతం నర్సింగ్ రావు, జ్యోతి, జీ.సుభాష్, ఉమారాణిలచే వేద పండితులు పూజలను నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనము, మంటపారాధన, ఏకాదశ రుద్రాభిషేకములు, పూర్ణాభిషేకములు, చండీ, రుద్రహవనములు, స్వామివారి అలంకరణ – లక్షబిల్వార్చన పూర్తి చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.
మహా అన్నదానం

మాస శివరాత్రిని పురస్కరించుకొని లక్ష బిల్వార్చన పూజ రోజున రాత్రి ప్రతి సంవత్సరం పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, విజయలక్ష్మి దంపతులు ఆలయ ఆవరణలో భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేస్తారు. కందాల ఉపేందర్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి కుమార్తె దీపికలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వయంభు భద్రకాళి అమ్మవారి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహా అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వీరభద్ర స్వామి మహిమాన్వితుడని గత కొన్ని సంవత్సరాలుగా ఈ అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు ఇంతటి మహాభాగ్యాన్ని కలిగించిన స్వామివారికి, ఆలయ అధికారులకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.