పోచమ్మమైదాన్, డిసెంబర్ 24: అంపశయ్య నవలలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని కాకతీయ యూనివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్, ప్రొఫెసర్ తాటికొండ రమేశ్ అన్నారు. హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్లో అంపశయ్య నవీన్ 81వ జన్మదినం సందర్భంగా సాహితీ సభను ఏర్పాటు చేసి నూతన గ్రంథాలను ఆవిష్కరించారు. ఉత్తమ రచయితలకు పురస్కారాలు పంపిణీ చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య బన్న అయిలయ్య అధ్యక్షతన జరిగిన సభలో వీసీ రమేశ్ మాట్లాడుతూ.. తెలుగు సాహితీ ప్రపంచంలో నిబద్ధత కలిగిన నవలా చక్రవర్తిగా, నిత్య నవనీతులుగా అంపశయ్య నవీ న్ ఉన్నారని అన్నారు. సాహిత్య సేద్యంలో నిరంతర పరిశోధకులుగా, కేంద్ర బిందువుగా, విసుగు, విరామం లేకుండా ప్రపంచానికి సాహిత్య కళను అందిస్తున్నారని కొనియాడారు. అలాగే అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ తరఫున ఒకతరం నుం చి ఇంకోతరానికి ఉపయోగపడే విధంగా సాహిత్యాన్ని సజీవంగా నిలుపుతున్నారన్నారు. సామాన్యులకు అర్థమయ్యేటట్లు సాహిత్య కృషి చేస్తున్నారని, ఆయన చివరి శ్వాస వరకు నిరంతర నవీకరణగా ఉంటారని తెలిపారు.
అంపశయ్య నవీన్ తన జీవితంలో ప్రతిక్షణం సాహిత్య అధ్యయనానికి, సమాజ హితం కోసం పాటుతున్నారని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య అన్నారు. ఆయన రచనలు తెలుగువాళ్ల వారసత్వ సంపదగా నిలుస్తున్నాయని తెలిపారు. కలం పట్టిన ఆయన ఇప్పటి వరకు 34 నవలలు, 95 కథలు, 8 కథా సంపుటిలు రాసి మహోన్నత లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఆయన నిరంతరం అన్వేషణ చేస్తూ సమాజ రుగ్మతలను తొలగించడానికి కృషి చేస్తున్నారని వివరించారు.
-ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ బన్న అయిలయ్య
దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా వచ్చే పుట్టిన రోజు నాటికి నవల రాయాలని ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ సూచించారు. దేశంలో అనేక సమస్యలు, సవాళ్లు ఉన్నాయని, రైతులు, నిరుద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నవల తీసుకు రావాలని కోరారు. అంపశయ్య నవీన్ అంటే తనకెంతో గౌరవమని, ఆయన పింగిళి కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్నప్పుడు ఎంతో నిబద్ధత, నిబంధనలతో ఉండేవారని గుర్తు చేశారు. ఆయన రాసిన నవలలకు నేడు ప్ర పంచ వ్యాప్తంగా గుర్తింపు రావడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్‌ఖాన్ అంపశయ్య నవీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
-ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్
అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ ద్వారా బహుమతులు పొందిన నాలుగు నవలలను ప్రముఖ రచయిత కేపీ అశోక్‌కుమార్ సమీక్షించారు. అనంతరం బహుమతులు పొందిన రచయితలు నర్రా ప్రవీణ్‌రెడ్డి, కందివనం స్ఫూర్తి, కోట్ల వనజాత, డాక్టర్ కే గీతను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమ నిర్వాహాకులు పొట్లపల్లి శ్రీనివాసరావు, కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సురేశ్‌లాల్, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, వరలక్ష్మి, డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ సదాశివ్, ఘంటా రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.