వరంగల్ చౌరస్తా, నవంబర్ 25 : ఎంజీఎం హాస్పిటల్ ఔట్‌పోస్టును అక్రమ వసూళ్లకు అడ్డాగా మార్చేస్తున్నాడు ఓ కానిస్టేబుల్. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా ఉచిత వైద్య సేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం పదుల సం ఖ్యలో మెడికో లీగల్ కేసులు (ఎంఎల్సీ) నమోదవుతూ ఉంటాయి. హత్యాయత్నం, ఆత్మహత్యాయత్నం లాంటి ఎంఎల్సీ కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఆయా పోలీస్ స్టేషన్లకు తెలపడం, అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు, రోగుల వాంగ్మూలం తీసుకోవాల్సిన విషయాన్ని అధికారులకు చేరవేయడం, వైద్యం పొందుతున్న వారు మృతి చెందిన సమయం, వివరాలను నమోదు చేసుకోవడం వీరు చేయాల్సిన పనులు.
అయితే వీటిని పక్కన పెట్టి మెడికో లీగల్ కేసులు నమోదు చేసుకోవడానికి, వైద్య పరమైన సలహాలు, సూచనలు చేయడం, ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించడం, మరణించిన వ్యక్తిని స్వగ్రామం చేర్చడానికి అంబులెన్స్‌లు మాట్లాడడం, మరణించిన వ్యక్తికి సంబంధించిన మెడికల్ రికార్డులు సమకూర్చడం, ఇతరత్రా సహకారం అందించడం లాంటివి చేస్తూ అక్రమంగా నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడు. సదరు ఉద్యోగి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి తప్పుడు సమాచారం ఇవ్వడం మూలంగానే బతికున్న వ్యక్తి స్థానంలో గుర్తు తెలియని మృతదేహాన్ని బంధువులకు అప్పగించిన ఘటన కొద్దిరోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచనలంగా మారింది.
అందుకు కారణమైన సిబ్బందిపై సంబంధిత అధికారులు క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం మూలంగా అక్రమ వసూళ్లకు తెగబడుతున్నట్లు తోటి ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి. వైద్యసేవల కోసం వచ్చే బాధితులకు సరైన సేవలు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.