హనుమకొండ చౌరస్తా, మే 31 : కాకతీయ యూనివర్సిటీలో డబ్బుకు ఆశపడిన ముగ్గురు దినసరి వేతన కూలీలు ఎగ్జామినేషన్ బ్రాంచి నుంచి జవాబు పత్రాలు బయటకు పంపిన ఘటన కేయూలో దుమారం రేపుతోంది. ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ నర్సింహాచారి కేయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న దినసరి వేతన కూలీలు సునీల్, రాణా ప్రతాప్, శ్రీధర్ విద్యార్థుల జవాబు పత్రాలను తిరిగి వారికి చేరవేసి, మళ్లీ రాయించి ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా వాటిని ఎగ్జామినేషన్ బ్రాంచ్‌కు చేర్చినట్లు తెలుస్తోంది. ముగ్గురు దినసరి కూలీలను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీలో జరిగిన ఘటనపై ఇన్చార్జి వీసీ వాకాటి కరుణ సీరియస్ అయ్యారు. ఎగ్జామినేషన్ బ్రాంచ్‌లో జరిగిన ఘటనపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మల్లారెడ్డితో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.