రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో జరిగిన పోటీల్లో వివిధ జిల్లాల నుంచి అథ్లెటిక్స్ హాజరై నువ్వా.. నేనా అంటూ పోటీపడ్డారు. రెండు రోజులు జరిగే పోటీలకు మొత్తం 503 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హాజరై ప్రతి విద్యార్థికి చదువుతోపాటు క్రీడలు అవసరమని సూచించారు. అలాగే, కార్యక్రమంలో డబుల్ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత జేజే శోభ హాజరై క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు.
– నయీంనగర్, ఫిబ్రవరి 25
నయీంనగర్, ఫిబ్రవరి 25 : హనుమకొండలోని జేఎన్ఎస్(జవహర్లాల్ నెహ్రూ స్టేడియం) వేదికగా 9వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్-2023 పోటీలు శనివారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి 503మంది క్రీడాకారులు తరలివచ్చారు. పోటీలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ హాజరు కాగా డబుల్ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత జేజే శోభ రాక అథ్లెట్లలో ఉత్సాహం నింపింది. మొత్తం 48 ఈవెంట్లు నిర్వహించనుండగా తొలిరోజు వివిధ క్రీడాంశాల్లో అథ్లెట్లు సత్తాచాటారు. ఎండను సైతం లెక్క చేయక ఒకరికి మించి ఒకరు ఆట తీరును ప్రదర్శిస్తూ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు.
తొలిరోజు విజేతల వివరాలు
ఆటలూ ముఖ్యమే..
ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఆటలూ ఎంతో అవసరం అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో జిల్లా ఐటీ, ఎడ్యుకేషన్ హబ్‌గా వెలుగొందుతున్నదన్నారు. అలాగే స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని ఈవెంట్లు నిర్వహించేందుకు ముందుకురావాలని అందుకు తన పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.
కష్టపడితే లక్ష్యసాధన సులువే : అర్జున అవార్డు గ్రహీత జేజే శోభ
‘క్రీడాకారులు ఎంత కష్టపడితే అంత సులువుగా లక్ష్యానికి చేరువవుతారు. తెలంగాణ రాష్ట్రంలో మంచి క్రీడాకారులు ఉన్నారు. ప్రతిభ ఉన్న వారికి తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరం. క్రీడాకారులకు నేడు అన్ని రకాల వసతులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని ముందుకుపోవాలి’ అంటూ డబుల్ ఒలింపియన్, అర్జున అవార్డు గ్రహీత జేజే శోభ పేర్కొన్నారు. జేఎస్ఎన్లో జరిగే అథ్లెటిక్స్ పోటీలకు గెస్ట్‌గా హాజరైన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో కాసేపు ముచ్చటించారు. క్రీడల్లో ఆమె రాణించిన తీరు.. అనుభవాలను పంచుకున్నారు.
జేజే శోభ కర్ణాటకలో ధార్వాడ్ సమీపంలోని పశుపతిహాల్ అనే కుగ్రామంలో జన్మించారు. 7వ తరగతి నుంచే క్రీడలంటే ఎంతో ఇష్టం. ఆటలపై ఆమెకున్న ఆసక్తిని గమనించిన ఉపాధ్యాయులు స్పోర్ట్స్ హాస్టల్లో వేయాలని తల్లిదండ్రులకు సలహా ఇచ్చారు. ఇలా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో హాస్టల్ బాటపట్టిన శోభ.. ఇటు చదువుతో పాటు క్రీడలపై ఎంతో శ్రద్ధ చూపారు. అప్పటినుంచి ఆమెలో ఉత్సాహం, పట్టుదల నేడు ఇలా అందరిముందు నిలబెట్టేలా చేశాయి. మేము చదువుకొనే రోజుల్లో ఎవ్వరికీ ఆటలంటే ఎక్కువగా తెలిసేది కాదని, వసతులు సరిగ్గా ఉండేవి కావంటారామె. కానీ నేడు అన్ని వసతులు ఉన్నాయని.. క్రీడాకారులు సరిగ్గా దృష్టి పెడితే మంచి అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ క్రీడాకారులకు దిశానిర్దేశం చేశారు శోభ.
జేజే శోభ సాధించిన విజయాలు