పట్టభద్రులు చైతన్యంతో ఓటెత్తారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం ఉప ఎన్నిక జరుగగా ఉమ్మడి వరంగల్లోని ఆరు జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తొలుత మందకొడిగా సాగిన పోలింగ్ మధ్యాహ్నం తర్వాత పుంజుకోగా యువతతో పాటు సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ ఉద్యోగులు ఉత్సాహంగా ఓటేసేందుకు బారులు తీరారు. అలాగే దివ్యాంగులు సైతం బాధ్యతగా తమ హక్కును వినియోగించుకోవడం కనిపించింది.
సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియగా ఉమ్మడి జిల్లాలో 72.66 శాతం నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నగరంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, జిల్లాల్లో ఎస్పీలు బందోబస్తును పర్యవేక్షించగా, కలెక్టర్లు పోలింగ్ నిర్వహణను పరిశీలించారు. పోలింగ్ ముగిసిన తర్వాత బందోబస్తు మధ్య ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రానికి బ్యాలెట్ బాక్సులను తరలించారు. మొత్తం 52 మంది అభ్యర్థులు బరిలో నిలువగా గ్రాడ్యుయేట్లు పట్టమెవరికి కట్టారనేది వచ్చే నెల 5న తేలనున్నది.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 27