సుబేదారి, జూలై 30: అనుమతి లేకుండా క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఐదుగురు నకిలీ వైద్యులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలంగాణ వైద్య మండలి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
హనుమకొండ రాంనగర్లో గాయత్రి క్లినిక్ నిర్వాహకుడు ఏ లకపతి, రాయపుర ఇందిరానగర్‌లోని శ్రీరాజరాజేశ్వరి క్లినిక్ నడిపిస్తున్న బత్తుల రాజ్‌కుమార్, రెడ్డికాలనీలోని వెంకటేశ్వర క్లినిక్ నిర్వహిస్తున్న ఫార్మాసిస్టు, శ్రీశ్రీ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకుడు సీహెచ్ భాస్కర్‌పై ఐపీసీ 417,420, 22టీఎంపీఆర్, 34, 54 ఎన్ఎంసీ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
డాక్టర్లుగా చెలామణి అవుతూ వైద్యం చేస్తూ ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే నకిలీ వైద్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య మండలి పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ హెచ్చరించారు. వరంగల్ నగరంలో మరికొంతమంది నకిలీ వైద్యులు ఉన్నారని, వారిపై కూడా త్వరలో కేసులు పెడుతామని టీజీఎంసీ సభ్యుడు డాక్డర్ శేషుమాధవ్ పేర్కొన్నారు.