అడవిబిడ్డలను ఆదుకున్నది సీఎం కేసీఆరేనని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నల్లబెల్లి మండలం ఆసరవెల్లి గ్రామంలో 366మంది గిరిజనులకు పోడు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల కలను నెరవేర్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. త్వరలోనే పోడు భూములకు త్రీ ఫేస్ కరంట్ సరఫరా వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. ముంపును నివారించి ఆసరవెల్లి గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరాగా నిలిచిందని తెలిపారు. అరిగోస పెట్టిన అక్కెరకు రాని పార్టీలను ప్రజలు తరిమికొట్టాలన్నారు.
– నల్లబెల్లి, జూలై 9
నల్లబెల్లి, జూలై 9: పోడు రైతులను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆసరవెల్లిలో ఆదివారం పోడు భూముల పట్టాల పంపిణీ జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా పోడు రైతులు పెద్దికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆసరవెల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గొల్లపల్లి, లక్ష్మీతండా, ఈర్యతండా, రామారావుతండా, మేడెపల్లి గ్రామాల్లోని 366 మంది రైతులకు ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పట్టాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు విధానాలతో మండలంలోని ఏడు గ్రామాలను ముంపునకు గురిచేసిందన్నారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలపై దాడులకు పాల్పడుతూనే రెండు వేల ఎకరాల భూములను ముంపునకు గురి చేసేందుకు కుటిలయత్నం చేసి, ఈ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేసి పోడు రైతులపై అక్రమ కేసులు బనాయించిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ముంపును నివారించి, నేడు అదే రంగాయ చెరువు ద్వారా ఆయకట్టు రైతులకు గోదావరి జలాలతో రెండు పంటలకు సాగునీరు అందిస్తున్నట్లు వివరించారు.
పోడు వ్యవసాయం చేసుకుంటూ పూరిగుడిసెల్లో నివసించిన ఆసరవెల్లి వాసులకు నాటి పాలకులు కనీసం ఇంటి నంబర్ ఇవ్వలేకపోయారని, అలాంటి గ్రామాన్ని ముంపు నుంచి కాపాడడంతోపాటు నేడు గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామన్నారు. అలాగే, గ్రామంలోని అన్ని వాడల్లో సీసీరోడ్లు, ప్రధాన మార్గానికి తారురోడ్డు, మిషన్ భగీరథ తాగునీటి వసతితోపాటు విద్య, వైద్య సౌకర్యాలు కల్పించామన్నారు. ఫారెస్టు అధికారుల చిత్రహింసలకు బలైన గ్రామ గిరిజన, ఆదివాసీ బిడ్డలకు నేడు పోడు పట్టాలను పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. అంతేకాకుండా ప్రతి పోడు రైతుకూ రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించడంతోపాటు పోడు భూములకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా చేసేందుకు సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారన్నారు. పోడు రైతులను అరిగోస పెట్టిన అక్కరకు రాని పార్టీలను తరిమికొట్టాలని పెద్ది పిలుపునిచ్చారు.
పోడు రైతులు వృద్ధిలోకి రావాలి
శాశ్వత పట్టాలు పొందిన ప్రతి పోడు రైతు ధీమాగా వ్యవసాయం చేస్తూ వృద్ధిలోకి రావాలని ఎమ్మెల్యే పెద్ది సూచించారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల అండదండలు ఎల్లవేళలా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత, ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్, సీఐ సూర్యప్రసాద్, ఎస్సై నైనాల నరేశ్, సర్పంచ్‌లు లావుడ్యా తిరుపతి, దాస పూలమ్మ, రాజునాయక్, చింతపట్ల సురేశ్రావు, బీఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్‌గౌడ్, మాజీ ఎంపీపీలు బానోత్ సారంగపాణి, కకెర్ల శ్రీనివాస్‌గౌడ్, క్లస్టర్ ఇన్చార్జిలు శివాజీ, కొత్తపెల్లి కోటిలింగాచారి, మోహన్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.
అన్నం పెట్టే ప్రభుత్వాన్ని మర్చిపోం
అన్నం పెట్టే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని జీవిత కాలం మర్చిపోం. చానా ఏండ్లుగా పోడు ఎవసం చేసుకుంటూ పిల్లలను సాదుకుంటున్నాం. కేసుల పాలయ్యాం. అరవ కష్టం చేసుకున్నాం. ఎవరూ మమ్ములను ఆదుకోలె. ఇప్పుడు కేసీఆర్ సార్ దయతో పట్టాలు వచ్చినై. రంది పోయింది. సార్ కరంట్ కూడా ఇస్తాడని తెలిసింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి దయతో మా చెర్లళ్లకు గోదావరి నీళ్లు వస్తున్నాయి. పట్టాలు, కరంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్ రుణపడి ఉంటాం. ఆయన వెంటే జీవితకాలం ఉంటాం.
– బదావత్ మంజుల, ఆసరవెల్లి, మహిళా పోడు రైతు
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం
దశాబ్దాల కాలంగా పోడు భూముల విషయంలో ఫారెస్టు అధికారుల వేధింపులు తట్టుకోలేకపోయాం. భయంభయంగా వ్యవసాయం చేసుకుంటున్నాం. మాకు సీఎం కేసీఆర్ పట్టాలు ఇవ్వడం ఆనందంగా ఉంది. యజమానులం అవుతామని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇన్నాళ్లకు కేసీఆర్ సార్ దయతో మా శ్రమ ఫలించింది. మా జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం. బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటాం.
– అర్రెం సాంబయ్య, లబ్ధిదారు(మేడెపల్లి), ఎఫ్ఆర్సీ కమిటీ అధ్యక్షుడు
కాంగ్రెసోళ్లు కేసులు పెట్టించిండ్రు
పోడు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నాం. గతంలో కాంగ్రెసోళ్లు రంగాయ చెరువు రిజర్వాయర్ నిర్మాణంలో ఏడు గ్రామాలను ముంపునకు గురిచేసే ప్రయత్నం చేసి మాపై ఫారెస్టు అధికారులు, పోలీసోళ్లతో దాడులు చేయించి కేసులు పెట్టించిండ్రు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సార్ కృషితో నేడు ముంపు లేకుండా రంగాయ చెరువులోకి గోదావరి నీళ్లు వస్తున్నాయి. మాకు పోడు పట్టాలు అందించి, త్రీఫేస్ కరంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
– మూడు ఈర్య, పోడు రైతు(ఈర్యతండా)