నెక్కొండ జూలై 7 : పేదరికం అధిగమించేందుకు గొర్రెలను కొనుగోలు చేసి వాటి ద్వారా జీవనోపాధి పొందాలని ఆశించిన ఓ నిరుపేద కుటుంబం ఒక్కసారిగా తీవ్ర విషాదంలోకి నెట్టివేయబడింది. నెక్కొండ మండలంలోని పెద్ద కొర్పోలు గ్రామానికి చెందిన ఆలకుంట శ్రీనివాస్ కు చెందిన 30 గొర్రెలు సోమవారం మధ్యాహ్నం గూడ్స్ రైలు కిందపడి మృత్యు వాతపడ్డాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలకుంట శ్రీనివాస్ కూలినాలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కూలీ పనులకు వెళ్తూ జీవన సాగిస్తున్న ఆ కుటుంబం రెండేళ్ల కిందట అప్పుచేసి చేసి గొర్రెలను కొనుగోలు చేశాడు.
రోజు మాదిరిగానే గొర్రెలను మేపడానికి గ్రామశివారులోకి శ్రీనివాస్ కుమారుడు సాయి కిరణ్ గొర్రెలను తీసుకువెళ్లాడు. గొర్రెలు మేత మేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుక్కల గుంపు గొర్రెల పైకి దాడిగి దిగడంతో దగ్గరలోని రైల్వే ట్రాక్ పైకి 30 గొర్రెలు పరిగెత్తాయి. ఇదే సమయంలో డౌన్ ట్రాక్ లో కాజీపేట నుంచి విజయవాడ వైపు వెళ్లే గూడ్స్ రైలు 30 గొర్రెలను ఢీకొట్టడం గొర్రెలన్నీ మృత్యువాత పడ్డాయి. మృత్యువాత పడిన గొర్రెల విలువ మూడు నాలుగు లక్షలు ఉంటాయని బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.