‘రాష్ట్రం వచ్చినప్పటి నుంచి పదేళ్ల కాలంలో కరెంట్‌కు ఢోకా లేదు. 2014కు ముందు అరకొర విద్యుత్‌తో ప్రజలు చాలా కష్టాలు పడ్డరు. అప్పటి ప్రభుత్వం ఎవుసానికి ఆరేడు గంటల కరెంటే ఇచ్చేది. లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయేటివి. రాత్రి వేళల్లో త్రీ ఫేస్ కరెంట్ తీసేటోళ్లు. విష పురుగుల బారిన పడి, విద్యుత్ షాక్‌ల వంటి ప్రమాదాలతో ఎంతో మంది రైతుల ప్రాణాలు పోయినయ్. కరెంట్ లేకపోవడంతో ఎలక్ట్రీషియన్లు, పిండి గిర్నీ నిర్వాహకులకు పనిలేక ఖాళీగా కూర్చునేటోళ్లు. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ గత కాంగ్రెస్ పాలనే గుర్తుకు తెస్తున్నది. అస్తవ్యస్తంగా ఉన్న కరెంట్‌ను గాడిన పెట్టింది కేసీఆరే. మంచి చేసిన ఆయనపై నిందలు వేయడం తగదు. కరెంటు విషయంలో తప్పు పట్టాల్సిందేమీ లేదు’ అని రైతులు, మోటర్ మెకానిక్ తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 21
చెన్నారావుపేట: 16 ఏళ్లుగా పిండి గిర్ని షాపు నడుపుతున్న. రాష్ట్రం రాకముందు కరెంట్ కోసం ఉద్యమాలు చేయాల్సి వచ్చేది. ఊర్లో కరెంట్ ఎప్పుడొస్తుందో అని వేయి కళ్లతో ఎదురుచూసే వాళ్లం. రోజులో 3 లేదా 4 గంటల కరెంట్‌తో పిండి గిర్ని నడపడానికి నానా తంటాలు పడేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6 నెలల్లో కరెంట్ వ్యవస్థలో తీవ్ర మార్పు వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడంతో పాటు 24 గంటలు అందించి కోతలు లేకుండా చేసింది. ఆయన కరెంట్ ఎక్కడి నుంచి తెచ్చిండని ఎవరూ ఆలోచించలే. పని చేసుకొని బతకడానికి కరెంట్ ఉందా లేదా అనేదే చూశారు. కరెంట్ కొనుగోళ్లలో కోట్లు తిన్నాడనేది పచ్చి అబద్ధం. అదే జరిగితే 24 గంటల కరెంట్ ఎలా సాధ్యమైంది.
-పాషా, పిండి గిర్ని నిర్వాహకుడు, చెన్నారావుపేట
శాయంపేట: కేసీఆర్ రాక ముందు పరిస్థితి వేరేగా ఉండే. నాకు రోజుకు ఆరేడు మోటర్లు రిపేర్లు వచ్చేవి. రాత్రంతా కూర్చుని చేసేవాళ్లం. కేసీఆర్ వచ్చినంక 24 గంటల విద్యుత్‌ను మంచిగా ఇవ్వడంతో మోటర్లు కాలిపోవడం బందైంది. నిజంగా చెప్పాలంటే పదేళ్లు కరెంటు మోటర్లు రిపేరుకు రావడం పూర్తిగా తగ్గింది. రాత్రిళ్లు పొలాలకు రైతులు వెళ్లడం తగ్గింది. కరెంటు విషయంలో కేసీఆర్‌ను తప్పు పట్టాల్సిందేమీ లేదు.
– బోనాల రమేశ్, మోటర్ వైండింగ్ మెకానిక్, శాయంపేట
పరకాల: ఉమ్మడి రాష్ట్రంలో ఆరకొర విద్యుత్‌తో రైతులు తీవ్ర కష్టాలు పడ్డరు. అప్పటి ప్రభుత్వం ఎవుసానికి ఆరేడు గంటల కరెంటే ఇచ్చేది. అది రాంగనే రైతులందరూ ఒకేసారి మోటర్లు ఆన్ చేసేవారు. ట్రాన్స్ఫార్మర్లపై లోడ్ పడి లోవోల్టేజీ సమస్య వచ్చేది. దీంతో మోటర్లు కాలిపోయేవి. ఏడాదికి రెండు మూడు సార్లు కూడా కాలినయ్. కేసీఆర్ సీఎం అయిన తర్వాత 24 గంటల కరెంటు రావడంతో మోటర్లు కాలుడు తగ్గినయ్.
– పల్లెబోయిన రాజు, రైతు, లక్ష్మీపురం, పరకాల మండలం
నల్లబెల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కరెంట్ కోసం పడ్డ కట్టం పగోడికి కూడా రావొద్దు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడ్తే సమయ పాలన లేని కరెంట్ సరఫరాతో పంటలకు నీరు పెట్టలేక గోస పడ్డం. భార్యతో కలిసి రాత్రి వేళ పంట చేనుల కాడికి పోయేది. కొంతమంది రైతులు పురుగు బూసి కాటేసి చనిపోయిన దుస్థితి ఉండె. అయినా సరే చేసిన అప్పులు తీర్చాలని రాత్రంతా పొలాల కాడ్నే గడిపేది. అచ్చీరాని కరెంట్‌తో దొయ్య పారక పోతుండె. కరెంట్ మోటర్లు మాటిమాటికి కాలుతుండె. మోటర్లు అల్లియ్యాలంటె అప్పు కోసం సావుకారి వద్దకు ఉరుకుతుంటిమి.
విత్తనాలు, పిండి బత్తాల కోసం మండలకేంద్రంలోని ఎరువుల దుకాణాల కాడ ఎండలో లైన్లు కడుతుంటిమి. అయినా ఒక్క పిండి బత్త దొరుకుడు గగ్గలమె. ఇన్ని కట్టాలు పడ్డా కూడా ఆశించిన దిగుబడి రాకపోతుండె. రైతుల గోసను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, బీజేపోళ్లు పట్టించుకోలె. కేసీఆర్ సార్ కడుపు సల్లగుండ.. తెలంగాణ వచ్చినంక మాకు గోదావరి నీళ్లిచ్చిండు, 24 గంటల కరెంట్, నాణ్యమైన విత్తనాలు, అదునుకు పిండి బత్తాలు ఇచ్చిండు. పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతు చచ్చిపోతె రూ. 5 లచ్చల బీమా ఇచ్చి ఆదుకుండు. ఇలాంటి పెద్ద సార్‌పై నేడు కాంగ్రెస్ సర్కారు కుటిల ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.
– ఇంతల అనంతరెడ్డి, రైతు, పంతులుపల్లె, నల్లబెల్లి
మహబూబాబాద్ రూరల్: రాష్ట్రం ఏర్పడక ముందు సరైన కరెంట్ లేక అనేక ఇబ్బందులు పడ్డం. గతంల కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా బావి కాడకు పోయేది. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి సమస్యలు ఉండొద్దని 24 గంటల కరెంట్ ఇచ్చింది. అది కూడా రెండు పంటలకు ఉచితంగ. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసింది. గత యాసంగిలో సరైన కరెంట్ లేక పంటలు మొత్తం ఎండిపాయె. నిరంతరం కరెంట్ ఇచ్చిన కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరైంది కాదు.
– బానోతు నవీన్ నాయక్, రైతు, దామ్యతండా, మహబూబాబాద్